Chandrababu Naidu comments on his health: 10, 15 ఏళ్లు బతుకుతానేమో: చంద్రబాబు
Amaravati | ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
నర్సరావుపేట: 40 ఇయర్స్ ఇన్ పాలిటిక్స్ అంటూ గంభీరంగా ఉండే టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహా అంటే తాను ఇంకో 10 లేక 15 ఏళ్లు బతుకానని.. అది కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నందున ఈ మాట చెబుతున్నా అన్నారు. ఆదివారం రాత్రి నర్సరావుపేటలో పర్యటించిన ఆయన రాజధాని అమరావతి కోసం జోలెపట్టి విరాళాలు సేకరించారు. తరచుగా రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సీరియస్‌గా ఉంటే ఆయన ఈ సందర్భంగా వ్యక్తిగత, ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావించడం అందర్నీ ఆకర్షించింది.
‘కొందరు అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు. బెదిరించాలని చూస్తే భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇంకో 10 లేక 15 ఏళ్లు బతుకుతాను. నేను ఏ తప్పు చేయలేదని మళ్లీ చెబుతున్నాను. చట్టాలపై నాకు గౌరవం ఉంది. కానీ పోలీసులపై నమ్మకం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇక్కడే చెప్పారు. ప్రస్తుతం ఒక్క రాజధానికే దిక్కు లేదు కానీ, ఏపీకి మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని’ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also read: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
సీఎం జగన్ వీడియో గేమ్స్‌తో బిజీగా ఉంటే.. రాష్ట్ర మంత్రులు మాత్రం కోడి పందాలు, టిక్ టాక్‌లు, ఎడ్ల పందాలతో బిజీబిజీగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఏపీకి ఒకే రాజధాని అమరావతి అని, రాజధాని కోసం రాష్ట్ర ప్రజలు పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని అధికార వైఎస్సార్ సీపీ యత్నిస్తోందని ఆరోపించారు. కేసులకు భయపడకూడదని, కావాలంటే అరెస్ట్ చేశాక పోలీస్ స్టేషన్లో సైతం రాజధాని ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరి రింగ్ టోన్ జై అమరావతి ఉండాలని, ఫోన్ వస్తే హలో అనకుండా జై అమరావతి అని చెప్పాలంటూ సభకు హాజరైన వారిలో చంద్రబాబు నూతన ఉత్సాహాన్ని నింపారు.