Ramachandra Guha: రాహుల్ గాంధీపై రామచంద్ర గుహ సంచలన వ్యాఖ్యలు
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
కోజికోడ్: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ను ఎంపీగా ఎన్నుకుని కేరళ ప్రజలు ఘోర తప్పిదం చేశారని అభిప్రాయపడ్డారు. కేరళలో శుక్రవారం జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన దేశభక్తి వర్సెస్ యుద్ధోన్మాదం అనే విషయంపై మాట్లాడారు. యంగ్ ఇండియాకు ఓ వంశానికి చెందిన 5వ తరం నేత అక్కర్లేదని, 2024లోనూ కేరళ ప్రజలు రాహుల్‌ను మరోసారి ఎన్నుకుంటే అది కచ్చితంగా కష్టించి పనిచేసే, స్వయంగా రాణించిన ప్రధాని నరేంద్ర మోదీకి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు. అలా చేస్తే ప్రధాని మోదీకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నేత రాహుల్ కాదు. ఆదర్శవాదాన్ని కాంగ్రెస్ నాశనం చేయగా, వామపక్షాల వంచన లాంటివి మతోన్మాద చర్యలకు అవకాశం కల్పించాయి.
నరేంద్ర మోదీ సొంతంగా ఎదిగిన గొప్పనేత, 15ఏళ్ల పాటు ఓ రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఆయన సొంతం. కష్టించే వ్యక్తి. యూరప్‌లో హాలిడే ట్రిప్‌ల కోసం సమయాన్ని కేటాయించని వ్యక్తి మోదీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీకే పరిమితం కావడం ఆ పార్టీ ప్రాబల్యాన్ని దెబ్బతీస్తోంది. కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ కారణంగానే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. లేనిపక్షంలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామో లేదో మోదీ సర్కార్ సమీక్షించుకుని ప్రజలకు జవాబు చెప్పాల్సి వచ్చేదని’ అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..