కోవిడ్ 19 ( Covid19 ) పరిస్థితులపై ది లాన్సెట్ మెడికల్ జర్నల్ ( The Lancet medical journal ) హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. కరోనా మహమ్మారిపై దేశంలో నెలకొన్న సానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత ధోరణిగా కూడా వ్యాఖ్యానించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దేశంలో కరోనా మహమ్మారి వాస్తవ పరిస్థితులపై ఐసీఎంఆర్ అందిస్తున్న నివేదికపై ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ అయిన ది లాన్సెట్ సందేహాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. కరోనా మహమ్మారి ( Corona virus pandemic ) పై ప్రభుత్వ సానుకూల ధోరణిపై ఆందోళన వ్యక్తం చేసింది లాన్సెట్. అంతేకాదు..కరోనా వైరస్ కు సంబంధించిన శాస్త్రీయ ఆధారాల్నించి ఐసీఎంఆర్ ( ICMR ) పక్కకు పోతోందని..ఫలితంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు అందుతున్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తం కాకుండా ఇది నియంత్రిస్తుందని..మరింతగా సంక్షోభం పెరుగుతుందని హెచ్చరించింది. శాస్త్రీయ ఆధారాల్నించి తప్పుకోవడమనేది రాజకీయ ప్రేరేపిత ధోరణిగా లాన్సెట్ వ్యాఖ్యానించడం గమనార్హం. 


కరోనా వైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతుంటే...వాస్తవాల్ని దాచిపెట్టి ప్రజల్లో తప్పుడు ఆశల్ని రేకెత్తించవద్దంటూ దేశ నాయకులకు కూడా లాన్సెట్ పిలుపునిచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితిపై ప్రభుత్వం పాజిటివ్ ధోరణితో ఉండటం మంచిది కాదని చెప్పింది. ఇలా చేయడం వల్ల నివారణ చర్యల పట్ల ప్రజల్లో అనిశ్చితి వస్తుందని..ప్రజారోగ్య కార్యక్రమాలు దెబ్బతింటాయని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల్లో ఆశను రేకెత్తించే ఒత్తిడికి దేశంలోని శాస్త్రీయ సంస్థలు కూడా ప్రభావితమయ్యాయంటూ ఐసీఎంఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 


కరోనా మహమ్మారి చికిత్సగా శాస్త్రీయ ఆధారాల్లేకపోయినా యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ ( Hydroxychloroquine ) వాడటంపై ఐసీఎంఆర్ పాత్రను ప్రశ్నించింది. అదే విధంగా దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను ఆగస్టు 15లోగా అందుబాటులోకి  తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్న ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటనను కూడా  తప్పుబట్టింది. మరోవైపు ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు ఉందని భారత ప్రభుత్వం వాదించడాన్ని లాన్సెట్ సవాలు చేసింది. కేసులు, మరణాల డేటాపై పారదర్శకతను తప్పుబట్టింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా నివేదించినా, ఈ సంఖ్యలు ఎంతవరకూ నిజమో తెలుసుకోవడం కష్టంగా ఉందంటూ సందేహాలు వ్యక్తం చేసింది.


వాస్తవానికి కరోనా మహమ్మారిని నిలువరించగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉందని..కానీ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలిపింది. భారతదేశంలో వైద్యం, మందులు, ప్రజారోగ్యం, పరిశోధన, తయారీలో తగినంత నైపుణ్యం ఉందని కూడా స్పష్టం చేసింది. అదే సమయంలో కరోనా నిర్వహణకు సంబంధించి కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించిన తీరును ప్రశంసించింది. Also read: India Covid-19: 7కోట్లు దాటిన కరోనా టెస్టుల సంఖ్య