అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) లైంగిక ఆరోపణలు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల సమయంలో మరోసారి ఆరోపణలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మోడల్ అమీ డోరిస్ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ ( Republican party ) అభ్యర్దిగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడుతున్నారు. అటు డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) అభ్యర్ధిగా జో బైడెన్ ( Joe biden ) బరిలో నిలిచారు. ఈ నేపధ్యంలో డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి లైంగిక ఆరోపణలు ( Sexual assault ) రావడం కలకలం కల్గిస్తోంది. మాజీ మోడల్ అమీ డోరిస్ ట్రంప్ ( Ex model Amy Dorris ) పై ఆరోపణలు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తనను పట్టుకుని బలవంతంగా ముద్దుపెట్టుకున్నారనేది ఆమె ఆరోపణ. ఇప్పటికే ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఇ జీన్ కారోల్ చేసిన అత్యాచార, లైంగిక దుష్ర్పవర్తన ఆరోపణలకు తోడు అమీ డోరిస్ వ్యాఖ్యలు ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారాయి. 


1997లో న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ( Us open tennis tournament ) సందర్బంగా ట్రంప్ కు చెందిన వీఐపీ సూట్ లో తనపై లైంగికంగా వేధించారని అమీ డోరిస్ ఆరోపించినట్టు ది గార్డియన్ ( The Gaurdian ) వార్తను ప్రచురించింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని...తన శరీరాన్ని తాకరాని చోట అనుచితంగా తాకారని ఆరోపించారు. ఆ సమయంలో తన వయస్సు 24 ఏళ్లు కాగా...ట్రంప్ వయస్సు 51 సంవత్సరాలుంటుందని అమీ డోరిస్ తెలిపారు. వాస్తవానికి ఈ విషయాన్ని 2016లోనే బయటకు చెప్పాలనుకున్నా...కుటుంబ భద్రత, పిల్లల కోసం మౌనం దాల్చాననేది ఆమె వాదన. ఇప్పుడు టీనేజ్ లో ఉన్న తన కవల కుమార్తెలకు రోల్ మోడల్ గా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని డోరిస్ చెబుతున్నారు. 


అయితే ఈ ఆరోపణలపై ట్రంప్ మాత్రం స్పందించలేదు. కానీ అయన న్యాయవాదులు  కొట్టిపారేస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలు తప్ప మరొకటి కాదంటున్నారు. ఏదేమైనా ఎన్నికల వేళ ట్రంప్ పై వచ్చిన ఈ ఆరోపణలు ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. కరోనా సంక్రమణను కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న నేపధ్యంలో తాజాగా లైంగిక ఆరోపణలు ట్రంప్ ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేస్తున్నాయి. Also read: Dubai: ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం