అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 (US Election 2020 Results)లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ (Joe Biden) ఘన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)పై జో బిడెన్ విజయం సాధించి అమెరికాకు 46వ అధ్యక్షుడు అయ్యారు. అయితే ఇతర దేశాల మాదిరిగానే అమెరికాలోనూ మాజీ అధ్యక్షులకు కొన్ని సౌకర్యాలను ప్రభుత్వం, కొన్ని సంస్థలు కల్పించనున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే దేశానికి సేవ చేసినందుకుగానూ మాజీ అధ్యక్షులకు ఖర్చుల నిమిత్తం కొంత నగదు, కొన్ని అత్యవసర, రక్షణ సౌకర్యాలు ప్రభుత్వం కల్పించనుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ అధ్యక్షులు వ్యాపారం, లేక తమకు ప్రవేశం ఉన్న రంగాలలో పనులను తిరిగి ప్రారంభిస్తారు.



 


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన డోనాల్డ్ ట్రంప్‌నకు సైతం అమెరికా ప్రభుత్వం నుంచి ఫించన్ అందనుంది. మాజీ అధ్యక్షులకుగానూ 1958లో ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. అయితే మాజీ అధ్యక్షుడితో పాటు వారి సతీమణి లేక భర్తకు సైతం కొంతమేర ఫించన్ అందనుంది. ప్రస్తుతం మాజీ అధ్యక్షులకు ఏడాదికి 2 లక్షల 19 వేల 200 డాలర్లు (2,19,200 డాలర్లు భారత కరెన్సీలో దాదాపు 1.6 కోట్ల రూపాయలు) పింఛన్ అందిస్తున్నారు.



 


పదవి నుంచి దిగిపోగానే ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్ వీరికి వర్తించనుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి ఏడాదికి 20 వేల డాలర్లు చొప్పున పెన్షన్ అందిస్తారు. కానీ ఈ సమయంలో ఇతరత్రా వేరే పింఛన్ పొందితే మాత్రం అమెరికా ప్రభుత్వ పింఛన్ రద్దు చేస్తారు. ఏదైనా ఒక పింఛన్ మాత్రమే అందుకోవడానికి మాజీ అధ్యక్షుడి భాగస్వాములు అర్హులు. ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి మాజీ అధ్యక్షులకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వం భరిస్తుంది. వీరి టెలిఫోన్ బిల్లులు, ఇంటి అద్దె, ఇంటర్నెట్, పోస్టల్ లాంటి సేవలకు ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేస్తుంది. అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు మిలటరీ ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తారు. 



 


అధ్యక్షులుగా చేసిన సమయంలో తీసుకున్న నిర్ణయాలు, పనులు కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. వీటి కారణంగా అధ్యక్షులపై ఏదైనా దాడులు జరిగే అవకావం ఉన్నందున మాజీ అధ్యక్షులకు సైత రక్షణ కల్పించాలని చట్టం తీసుకొచ్చారు. తొలుత జీవితకాలం రక్షణ కల్పించేలా 1996 వరకు చట్టంలో పేర్కొన్నారు. అయితే కేవలం 10ఏళ్ల వరకే రక్షణ కల్పించాలని 1997లో చట్టంలో సవరణలో చేశారు. అయితే బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని తిరిగి జీవితకాలానికి వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇది అమలులో ఉంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe