సునీల్ శెట్టి కొడుకు హీరోగా "ఆర్ ఎక్స్ 100" హిందీ రీమేక్

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా తెలుగులో రూపొంది హిట్ అయిన సినిమా "ఆర్ ఎక్స్ 100". 

Updated: Oct 11, 2018, 07:52 PM IST
సునీల్ శెట్టి కొడుకు హీరోగా "ఆర్ ఎక్స్ 100" హిందీ రీమేక్

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా తెలుగులో రూపొంది హిట్ అయిన సినిమా "ఆర్ ఎక్స్ 100". ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారట. ఈ చిత్రంతో సునీల్ శెట్టి కుమారుడు అహన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. సాజిద్ నదియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినిమా ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటికే సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి "హీరో" చిత్రంతో బాలీవుడ్ తెరకు పరిచయం కాగా.. ఇప్పడు కొడుకు అహన్ శెట్టి కూడా హిందీ చిత్రసీమలో తన లక్ పరీక్షించుకోనున్నారు.

ఈ సంవత్సరం సునీల్ శెట్టి కూడా "వెల్ కమ్ టు న్యూయార్క్" చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించారు. అలాగే మరక్కార్ అనే పేరుతో విడుదలకు సిద్ధమవుతున్న మలయాళం చిత్రంలో నటిస్తున్నారు. గతంలో సునీల్ శెట్టి కూడా అనేక తెలుగు సినిమాల హిందీ రీమేక్‌లలో నటించారు. చిరంజీవి నటించిన "హిట్లర్" చిత్రాన్ని హిందీలో "క్రోధ్" పేరుతో రీమేక్ చేయగా.. ఆ చిత్రంతో పాటు రాజశేఖర్ నటించిన అన్న, శివయ్య మొదలైన చిత్రాల రీమేక్‌లలో కూడా సునీల్ నటించారు.

ఇప్పుడు సునీల్ కొడుకు కూడా మరో తెలుగు సినిమా రీమేక్ చేయబోతుండడం విశేషం. తొలుత డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. ఆర్ ఎక్స్ 100 చిత్రం తెలుగులో నిర్మాతలకు మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు హిందీ నిర్మాతలకు ఈ చిత్రం ఎంత వరకు లాభాన్ని తీసుకొస్తుందో సినిమా విడుదల అయితే కానీ చెప్పలేం.