నోట్లను రద్దు చేసి బుధవారానికి సరిగ్గా ఏడాదైంది. కీలకమైన ఈ నిర్ణయం తర్వాత దేశ వ్యాప్తంగా కనిపించిన ప్రభావంపై అధికార,విపక్షాల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.. నవంబర్ 8వ తేదీని బీజేపీ నల్లధనం వ్యతిరేక దినంగా పాటిస్తుండగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన దినం నిర్వహించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
నోట్ల రద్దుపై నిర్ణయం భిన్నవాదనలు:
ప్రధాని మోడీ: నోట్ల రద్దు నిర్ణయం వల్ల పెద్దనోట్ల చలామణి తగ్గడంతో పాటు ప్రత్యక్షంగా..పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధాని మోడీ వెల్లడించారు. ఆ రోజు అలాంటి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే పెద్దనోట్లు విపరీతంగా పెరిగిపోయి నల్లధనం సమస్య మరింత జఠిలమయ్యేదని పేర్కొన్నారు. నల్లధనం అరికట్టేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు
అరుణ్ జైట్లీ: ఏదాది క్రితం తీసుకున్నది ఎంత కీలక నిర్ణయమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధుల ప్రభావం నిలిచిపోయేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదపడిందన్నారు.
నిర్మాల సీతారామన్: నోట్ల రద్దు నిర్ణయం వల్ల డిజిటల్ చెల్లింపుల విస్తరణకు దోహదపడిందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ అభిప్రాయపడ్డారు
మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాల వాదన మరో రకంగా ఉంది...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: ప్రభుత్వ నిర్వాకం వల్ల మొత్తం ఆర్ధిక వ్యవస్థ మందగించిందని..జీడీపీ రేటు అమాంతంగా తగ్గిపోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు.
మమతా బెనర్జీ : నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని సక్రమ నగదుగా మార్చుకునేందుకు ఉద్దేశించిందని.. ఇది పెద్ద కుంభకోణంగా పశ్చిమబెంగా సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు
నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఈ రోజు 'ఇండియా సఫర్స్ '(భారత్ బాధపడుతోంది )పేరుతో పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ మద్దుతు తెలిపాయి. డీఎంకే పార్టీ మాత్రం తమ నిరసన కార్యాక్రమాల నుంచి దూరంగా ఉంటామని ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ నల్లధనం వ్యతిరేక దినంగా పాటించి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది.
నోట్ల రద్దుపై భిన్న స్వరాలు