సీబీఎస్‌ఈ పదో తరగతి మ్యాథ్స్ ప్రశ్నాపత్రం పరీక్షకు దాదాపు ఆరు గంటల ముందే లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీబీఎస్‌ఈ చీఫ్ అనితా కర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనతో ఇప్పటికి సీబీఎస్‌ఈకి సంబంధించి 10వ తరగతి మ్యాథ్స్ పత్రంతో పాటు, 12వ తరగతి గణిత, ఆర్థిక శాస్త్ర పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్ల లీకేజీ కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించడానికి రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్ పోలీసులు దాదాపు 1000 మంది విద్యార్థులకు ఈ లీకేజీకి సంబంధం ఉండే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని.. దాదాపు 28 లక్షల విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మోదీ సర్కారుపై మండిపడ్డారు
తాజాగా సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఎవరో చేతిరాతతో రాసిన ప్రశ్నాపత్రాలను స్కాన్ చేసి సీబీఎస్‌ఈ ఛైర్మన్‌కి ఈమెయిల్ ద్వారా పంపించారు. ఇవే ప్రశ్నాపత్రాలు ఆ తర్వాత దాదాపు 10 వాట్సాప్ గ్రూపుల్లో కూడా లభ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు ఈ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకొనేందుకు గూగుల్ సంస్థను సంప్రదించారు. అలాగే లీకేజీతో సంబంధముండే అవకాశం ఉందని తాము భావిస్తున్న పలు కోచింగ్ సెంటర్లపై కూడా నిఘా పెట్టారు. సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాక దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ధర్నాలకు దిగాయి. ఢిల్లీ ప్రీత్ విహార్ ప్రాంతంలో ఉన్న సీబీఎస్‌ఈ కేంద్రం వద్దకు భారీ స్థాయిలో విద్యార్థులు తరలివచ్చారు.
సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రం లీక్