Macherla Niyojakavargam Movie Review In Telugu: భీష్మ సినిమా తర్వాత సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న నితిన్ తన స్నేహితుడు, సినీ ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాచర్ల నియోజకవర్గం సినిమా కథకు కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12వ తేదీన విడుదలైంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ సహా ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేశాయి. అలాగే సినిమా నుంచి విడుదలైన కొన్ని సాంగ్స్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచడానికి కారణమయ్యాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఈ సినిమా రివ్యూలో చూద్దాం.
కథ:
విశాఖపట్నంలో ఉండే సిద్ధార్థ రెడ్డి(నితిన్) సివిల్స్ కి అటెండ్ అయ్యి టాపర్ గా నిలిచి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో తన పక్కింట్లో ఉండే గుంతలకిడి గుర్నాథం(వెన్నెల కిషోర్) మరదలు స్వాతి(కృతి శెట్టి) బాగా నచ్చడంతో ఆమె వెంట ప్రేమ పేరుతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆమె ప్రేమలో పడుతుందనుకున్న సమయంలో ఆమె తన సొంత ఊరు మాచర్లకు వెళ్ళిపోయిందనే విషయం తెలుసుకొని ఆమెను వెతుక్కుంటూ అదే ఊరికి వెళతాడు. ఆ సమయంలో అక్కడ 30 ఏళ్ల నుంచి అసలు ఎన్నికలే లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న రాజప్ప, అతని కుమారుడితో గొడవ పెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అసలు మాచర్ల నియోజకవర్గానికి, సిద్ధార్థ రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి? ప్రేయసి కోసం మాచర్ల వెళ్లిన సిద్ధార్థ రెడ్డి అదే ఊరున్న జిల్లాకు కలెక్టర్గా వెళ్లి ఏం చేశాడు? అదే ఊరికి కలెక్టర్గా వెళ్లడానికి గల కారణాలు ఏమిటి? చివరికి 30 ఏళ్లుగా ఎన్నికలే లేని మాచర్లలో సిద్ధార్థ రెడ్డి పంతంతో ఎన్నికలు జరుగుతాయా, లేదా? అనేదే సినిమా కథ.
విశ్లేషణ:
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ ఒక మాస్ మసాలా సబ్జెక్టుతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు అంటూ ముందు నుంచి టీం గట్టిగా ప్రచారం చేసింది. అయితే టీం ప్రచారం చేసిన మేరకు సినిమా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ఇది ఎక్కడో చూసిన విధంగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే సినిమా ఆద్యంతం అంతా రొటీన్ గా అనిపిస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగే యువకుడు తండ్రో తల్లో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ విని బాధ్యతలు తెలుసుకొని బాధ్యతలు భుజాన వేసుకున్న మసులుకున్న అనేక సినిమాలు మనం చూశాం. కానీ ఇక్కడ తన ప్రేయసి కోసం ప్రేయసి సొంత ఊరికి వెళ్లిన క్రమంలో అక్కడ అసలు ఎన్నికలే జరగవనే విషయం తెలుసుకుని ఎలా అయినా ఎన్నికలు జరిపించాలని బాధ్యత భుజాన వేసుకుంటాడు హీరో. ఇదొక్కటే కాస్త ఆసక్తికరమైన పాయింట్. కానీ నేరుగా సివిల్స్ పూర్తయిన వారికి కలెక్టర్గా పోస్టింగ్ ఇవ్వరు కానీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి ప్రభావంతో కావలసిన చోట పోస్టింగ్ వేయించుకున్నట్లుగా చూపించారు. ఇలాంటి లాజిక్స్ చాలా చోట్ల మిస్ అయ్యాయి. లాజిక్స్ సంగతి పక్కన పెడితే సినిమా మొత్తం కూడా ఇంతకుముందే చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉండడంతో ప్రేక్షకులలో ఏమాత్రం ఎగ్జయిట్మెంట్ అనేది ఉండదు. ఇప్పటివరకు చాలా సాఫ్ట్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన నితిన్ ఫుల్ లెంత్ మాస్ రోల్ చేయడం ఒక్కటే సినిమా విషయంలో కొత్త పాయింట్. అయితే సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాల్సిందేమిటంటే ఫైట్లు అలాగే గుంతలకిడి గురునాథం అనే పాత్రలో వెన్నెల కిషోర్ చేసిన కామెడీ. ఫైట్లు కూడా ఒకానొక దశలో రక్తపాతం ఎక్కువైపోయి మరీ ఇంతలా అవసరమా అనిపించేలా ఉంటాయి. కానీ గుంతలకిడి గురునాథం కామెడీ మాత్రం అలరిస్తుంది. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఒకసారి చూడచ్చు.
నటీనటులు:
ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే నితిన్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించాడు. ఒకపక్క అల్లరి చిల్లరి కుర్రాడిగా కనిపిస్తూనే తరువాత బాధ్యతలు తెలుసుకున్న కలెక్టర్ గా కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో కంటే కాస్త సన్నబడినట్లు స్క్రీన్ మీద కనిపించాడు ఇక కృతి శెట్టి కూడా పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలో మెరిసింది. ఆమెకు నటించే అంత స్కోప్ దక్కలేదు. కేథరిన్ థెరిసా ఒక పాటకు కొని సీన్లకే పరిమితమయింది. ఇక రాజప్పగా రాజప్ప కొడుకుగా రెండు పాత్రలు చేసిన సముద్రఖని ఎప్పటిలాగే తన అనుభవాన్ని అంతా చూపించారు. తమిళ నటుడు అయినా తెలుగువారిని మెప్పించే విధంగా ఆయన తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక రాజేంద్రప్రసాద్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, ఇంద్రజ, యాంకర్ శ్యామల తమదైన శైలిలో నటించి తమ పరిధి మేర ఆకట్టుకోగలిగారు. ఇక గుంతలకిడి గురునాథం అనే పాత్రలో నటించిన వెన్నెల కిషోర్, అతని కుమారుడి పాత్రలో నటించిన కమెడియన్ రాఘవ కుమారుడు మురారి తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. సినిమా మొత్తం మీద వీరిద్దరి ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయింది.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే
ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్ ప్రేక్షకులకు అందించేందుకు విఫల యత్నం చేశారు. కానీ రొటీన్ స్టోరీ కావడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదనే చెప్పాలి. అలాగే సినిమాటిక్ లిబర్టీ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయిన ఆయన చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యారు. ఆ విషయం మీద కూడా కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలాగే ఈ సినిమాకి సంగీతం అందించిన మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో పర్వాలేదు కానీ సాంగ్స్ మాత్రం ఆకట్టుకునే విధంగా లేవు. కేవలం ఐటెం సాంగ్ మాత్రం కొంత వరకు జనానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగినట్లుగా ఉంది. సొంత ప్రొడక్షన్ కావడంతో నిర్మాణ విలువల విషయంలో కూడా ఎక్కడా వెనక్కు తగ్గినట్లు అనిపించలేదు. ఇక ఫైట్లకు సాంగ్స్ కి భారీగానే ఖర్చుపెట్టినట్లు విజువల్స్ లో గ్రాండ్ ఇయర్ మెస్ కనిపిస్తోంది.
ఫైనల్ గా చెప్పాలంటే
నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్. అయినా సరే ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమే. రొటీన్ కథ కావడంతో ఈ సినిమా అనేకసార్లు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. రక్తపాతం ఎక్కువే కానీ ఫ్యామిలీతో ఒక సారి చూడచ్చు.
నటీనటులు: నితిన్, కృతి శెట్టి & కేథరిన్
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్ అసోసియేషన్ విత్ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ (ఇండియా) LLP
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
రచన & దర్శకత్వం: ఎమ్మెస్ రాజ శేఖర్ రెడ్డి
డీఓపీ: ప్రసాద్ మూరెళ్ల
మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వర సాగర్
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
రేటింగ్: 1.75/5
Read Also: Naga Chaitanya: విజయ్ సేతుపతి, నాని కాదనుకున్న పాత్ర చేసి డిజాస్టర్.. పాపం చైతూ!
Read Also: Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Macherla Niyojakavargam: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఆకట్టుకుందా?
నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం
ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల