Telangana Cold Waves: తెలంగాణలో చలితీవ్రత పెరిగిపోతుంది. రానురాను టెంపరేచర్లు పడిపోతున్నాయి. నిన్నటి నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. సంక్రాంతి దగ్గర పడుతున్న నేపథ్యంలో చలి మరింత పెరుగుతుంది. అయితే, రానున్న మూడు రోజులు పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నిన్నటి నుంచి చలి మరింత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అవుతున్నాయి. కానీ, రాత్రి సమయంలో మరింత చలి పెరుగుతోంది. రానున్న మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా నేటి నుంచి 11వ తేదీ వరకు వాతావరణంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గిపోతాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరగనుంది. మూడు రోజులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటితోపాటు సీజనల్ జబ్బులు కూడా చుట్టుముడుతున్నాయి.
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, కొమురం భీమ, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉదయం వేళ విపరీతంగా పొగమంచు కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఉదయం దూర ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో బయటకు రాకుండా ఉండటమే నయం.
వాహనదారులు ఉదయం బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాలని తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పింది. పిల్లలు, వృద్ధులు ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించింది.
ఇక అత్యవసర పరిస్థితుల్లో ఉదయం పూట బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా చలికోటు ధరించాలి. టోపీలు పెట్టుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటకు రావాలి. లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆహారంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడివేడి ఆహారం మాత్రమే తినాలి.