Dengue Symptoms In Telugu: ఇటీవల దేశంలో డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దోమలు విపరీతంగా పెరుగుతుండడంతో డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వర్షాకాలం ఆరంభం కావడంతో దోమల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో చిన్న పిల్లలను దోమలు కుట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జూలై మొదటి అర్ధభాగంలో అక్కడ 40కి పైగా కేసులు నమోదయ్యాయి.
నీరు ఎక్కువ నిల్వ ఉన్న ప్రదేశంలో దోమలు పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. వానా కాలంలో అనారోగ్యాలకు దోమలు కారణమవుతాయి. ముఖ్యంగా పిల్లలు బయట పార్కులు లేదా పాఠశాలల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దోమలు కుట్టుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలలో దద్దుర్లు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలను గుర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
మీ ఇంటికి సమీపంలో నీరు నిల్వ లేకుండా చూసుకోండి. అదేవిధంగా ఇంట్లో పూల కుండీలు, బకెట్లు, పాత టైర్లు, రోజూ నీటిని నిల్వ చేసే ఇతర వాటిలో ఎక్కువ కాలం నీరు నిల్వ లేకుండా చేయండి. వ్యర్థాలు, చెత్త పదార్థాలు లేకుండా చూసుకోండి. మీ నివాస స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి.
దోమలు కుట్టకుండా మార్కెట్‌లో లభించే క్రీమ్‌లను ఉపయోగించండి. పిల్లల వయసు తగినవి ఉపయోగించండి.
మీ ఏరియాలో వ్యర్థాల సేకరణ, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం వంటిపై మీ కాలనీ సంఘాలతో చర్చించండి. అదేవిధంగా స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించి వ్యాధుల నియంత్రణ, డెంగ్యూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరండి.
దోమలు కుట్టకుండా ఉండేందుకు రాత్ర సమయంలో పడుకునేటప్పుడు మీ బెడ్ లేదా మంచం చుట్టూ దోమ తెరలను ఉపయోగించండి. మీ ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు తెరలను వాడండి.
పిల్లలు ఆరుబయట ఉన్నప్పుడు.. వారికి పొడవాటి చేతుల షర్ట్‌లు, పొడవాటి ప్యాంటు, సాక్స్, బూట్లు ధరించండి. ముఖ్యంగా దోమలు ఎక్కువగా తెల్లవారుజామున, రాత్రి సమయంలో యాక్టివ్‌గా ఉంటాయి.. ఈ టైమ్‌లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి.