హైదరాబాద్: వైఎస్సార్సీపీలోకి శనివారం ఇతర పార్టీలకు చెందిన నేతలు క్యూ కట్టారు. వైఎస్సార్సీపీ తరపున కర్నూలు ఎంపిగా గెలిచి, ఆ తర్వాత కాలంలో టీడీపీలోకి వెళ్లిన బుట్టా రేణుక తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. శనివారం ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం వైఎస్సార్సీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి, మార్కాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత రామసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి షరతులు లేకుండానే వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీలోకి రావడం అంటే తిరిగి మళ్లీ తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పిన ఆమె.. పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా మళ్లీ తనను తిరిగి పార్టీలోకి తీసుకున్నందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
పార్టీలో చేరిన సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉండేదని అన్నారు. వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని మాగుంట స్పష్టంచేశారు. ఇదిలావుంటే, అంతకన్నా ముందుగా నెల్లూరుకు చెందిన టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీత కూడా వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.