అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తానని ప్రకటించిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని సమీకరించారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. అమరావతి పనులకు సడన్ బ్రేకులు పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ మాటల్లో అమరావతి ప్రస్తావన అంతగా వినిపించడం లేదు... రాష్ట్ర బడ్జెట్లోనూ రాజధానికి కేటాయింపులు పెద్దగా కనిపించడం లేదు. దీంతో రాజధాని నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోనుందనేది చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో రాజధాని అమరావతి నుంచి దొనకొండకు లేదా మరో ఇతర ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఇటీవలి కాలంలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
రాజధాని మార్పుపై బొత్స కీలక వ్యాఖ్యలు
రాజధాని మార్పుపై ఊహాగాానాలు ఉపందుకున్న తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయంటూ ఇటీవలి సంభవించిన వరదలను ఉదహరించారు. వరదల నుంచి రక్షణ కోసం కాల్వలు నిర్మించి.. వరద నీటిని బయటకు తోడాల్సి వస్తోందన్నారు. ఈ లెక్కన చూసుకుంటే వీటన్నింటి వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. దీనికి తోడు అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని... దాని వలన ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని రగడ ఊపందుకుంది.
అమరావతికి వదరల ముప్పు ఉందన్న విజయసాయిరెడ్డి
ఇదిలా ఉంటే వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రాజధాని అమరావతిపై మరో సంచలన ప్రకటన చేశారు. కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు ఉందని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను సంప్రదించే తీసుకుంటారని విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. ఈ వాఖ్యలు కాస్త మరింత చర్చకు దారి తీశాయి. కాగా అమరావతి గురించి బొత్స, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో రాజధాని విషయంలో ఏదో జరుగుతుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇది కాస్త ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.
కృత్రిమ వరద సృష్టిన్నారని చంద్రబాబు విమర్శ
అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి రాజధానిని తరలించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ అమరావతిలో కావాలనే వదరల ప్రాంతంగా చిత్రీకరిస్తున్నారని దయ్యబట్టారు. రాజధానిని మార్చే కుట్రతోనే కృత్రిమ వరద సృష్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెస్తారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలుగా ఉందని.. అయితే రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో ఉన్న జగన్ సర్కార్... రాజధాని ప్రాంతాన్ని ముంచాలనే ఉద్దేశంతోనే ప్రమాదకరంగా 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచారని విమర్శలు సంధించారు. తాను ఉంటున్న ఇంటిని ముంచడానికే కుట్రపూరితంగా నీళ్లను ఆపి ఒకేసారి వదిలారని ... ఇవి కృత్రిమంగా సృష్టించిన వరదలు చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ ఎంపీ కేనినేని తదితరులు రాజధాని మార్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
వికేంద్రీకరణ కోసమేనా...?
ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన సమయంలో దొనకొండ రాజధాని అవుతుందనే వాదన బలంగా వినిపించిన విషయం తెలిసిందే. రాజధాని అంశం చర్చకు దారి తీసిన నేపథ్యంలో రాజధానిని మార్పు చేయాలని భావిస్తే... దొనకొండకు మార్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రాజధానిని మార్చకపోయినా అభివృద్ధి వికేంద్రీకరణ వ్యూహంతో వైసీపీ నేతలు ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి అమరావతి ప్రాంతానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని మార్పు సంగతి నిజమేనా ?