'కరోనా వైరస్' వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. భారత దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 649కి చేరింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గజగజా వణికిపోతున్నారు. ఒకవేళ నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చినా సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇప్పటికే 15 రోజుల క్రితం నుంచే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, చిన్న దుకాణాలు అన్నీ బంద్ చేశారు. మూడు రోజుల క్రితం నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు, బస్సు ప్రయాణాలు కూడా రద్దు చేశారు. రెండు రోజుల క్రితం విమాన సర్వీసులు కూడా బంద్ అయ్యాయి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కానీ హరియాణాలోని ఓ కాలేజీలో మాత్రం విద్యార్థులు విధిగా తరగతులకు హాజరవుతున్నారు. హరియాణా రోహ్ తక్ లోని పండిట్ బీడీ శర్మ పీజీ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులను నిర్బంధంగా కాలేజీ యాజమాన్యం తరగతులకు పంపిస్తోంది. దీంతో విద్యార్థులు ఓ వీడియో చేసి తమ కాలేజీ యాజమాన్యం తీరును ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నప్పటికీ కాలేజీ యాజమాన్యం తమకు సెలవులు ఇవ్వకుండా కాలేజీలోనే బంధించిందని విమర్శించారు. తమకు ఇన్ఫెక్షన్ సోకితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. హరియాణా ప్రభుత్వం తమకు సాయం చేయాలని కోరారు.
#WATCH Video received from one of the students at Pt. BD Sharma PG Institute of Medical Sciences at Rohtak who was forced to attend lectures despite lockdown due to Coronavirus-"College authorities are not agreeing to grant us leave; we are being exposed to lot of infections." pic.twitter.com/7TfMum28L5
— ANI (@ANI) March 26, 2020
'లాక్ డౌన్' వేళ కాలేజీ దౌర్జన్యం