అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకిలో అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, వ్లాదిమిన్ పుతిన్ భేటీ సోమవారం జరిగింది. మొదట ఇరువురు నేతలూ ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఇంటెలిజెన్స్ అధికారులు డెమోక్రాట్ల అకౌంట్లను హ్యాక్ చేశారనడంలో ఆధారాలేవీ లేవని స్పష్టం చేశారు. డెమోక్రాట్ల ఆరోపణల మేరకు హ్యాకింక్‌పై అమెరికా, రష్యా ఉమ్మడిగా విచారణ జరుపుతాయన్నారు.
‘‘నేను పుతిన్‌ను సూటిగా ప్రశ్నించాను. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందా? ఎన్నికలను ప్రభావితం చేసిందా?’’ అని. "దీనిని ఆయన పూర్తిగా తిరస్కరించారు. నేను ఆయనను విశ్వసిస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలన్నదే తన అభిమతమని ..ట్రంప్ అధికారంలోకి వస్తే రెండుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని తాను విశ్వసించానని అన్నారు. ‘‘నేను ఎక్కువకాలం అమెరికా అధ్యక్ష పదవిలో ఉండను. అయితే, ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మాత్రం కొనసాగుతాయని ఆశిస్తున్నా’’ అని ట్రంప్ చెప్పారు. రష్యాతో ఇంతకాలం సత్సంబంధాలు లేకపోవడానికి గత అమెరికా ప్రభుత్వాలే కారణమని ట్రంప్ ఏకాంత భేటీకి వెళ్లే ముందు మీడియా ముందు నినదించారు.
కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు సమావేశమైన ఫిన్లాండ్‌నే ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్‌లు హెల్సింకిలో భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదు: ట్రంప్