డబ్బు ఎగవేతకు తనను ఓ బ్రాండ్ అంబాసిడర్ చేశారని మద్యం వ్యాపారి విజయ్ మాల్యా అన్నారు. రాజకీయ నేతలు ఓ పావుగా వాడుకోగా.. మీడియా, దర్యాప్తు సంస్థలు గుడ్డిగా ఆరోపణలను గుప్పించి అభియోగాలను నమోదు చేస్తున్నాయని ట్విట్టర్‌లో తెలిపారు. తన వాదనను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రులకు 2016లోనే వివరించినా.. వారి నుంచి స్పందన రాలేదని అన్నారు. దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసిన కుటుంబ ఆస్తుల విలువ (రూ.13,900) తన అప్పుల కంటే ఎక్కువని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌యూ)లనుంచి తాను తీసుకున్న రుణాలను చెల్లించడానికి గతంలో ప్రయత్నించానని, ప్రస్తుతం కూడా ప్రయత్నిస్తున్నానన్నారు.
రాజకీయ నాయకులు, మీడియా.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన 9 వేల కోట్ల రూపాయిల రుణాన్ని ఎగ్గొట్టానని ఆరోపణలు చేస్తున్నాయని మాల్యా అన్నారు. 17 బ్యాంకుల కన్సార్టియం కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు 5500 కోట్ల రూపాయిల రుణాలను ఇచ్చాయని, వాటిలో 600 కోట్ల రూపాయిలకు పైగా రికవరీ చేసుకున్నారని మాల్యా అన్నారు. రుణాలు తీర్చడానికి తాను శతవిధాలా ప్రయత్నిస్తున్నానని, దీనికి రాజకీయ రంగు పులిమితే తానేమీ చేయలేనన్నారు.
నా వాదనను ప్రధానికి వివరించాను: మాల్యా