China New Virus: చైనా లో ప్రస్తుతం హ్యూమన్ మెటాప్న్యుమోవైరస్ (HMPV) కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, ఆసుపత్రులు, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని అంటున్నారు. ఆన్‌లైన్ వీడియోల్లో ఆసుపత్రులు నిండిపోయిన దృశ్యాలు కనిపిస్తుండగా, ఇన్‌ఫ్లుయెంజా ఏ, HMPV, మైకోప్లాజ్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి పలు వైరస్‌లు వ్యాపిస్తున్నాయని నెటిజన్లు సూచిస్తున్నారు. ఈ వైరస్ గురించి కొన్ని కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం.
మొదటిసారిగా 2001లో కనిపించిన HMPV వైరస్ Pneumoviridae ఫ్యామిలీకి చెందినది. ఇది Respiratory Syncytial Virus (RSV)తో ఒకే కుటుంబానికి చెందినదని US CDC నిర్ధారించింది. ఈ వైరస్ సాధారణంగా పై, దిగువ శ్వాసనాళ ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. దీని లక్షణాలు మాములు జలుబు లేదా ఫ్లూ మాదిరిగానే ఉంటాయి.
HMPV ఇతర శ్వాసకోశ వైరస్‌ల లాగానే వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా దగ్గు, తుమ్ములతో, చేతులు కలపడం లేదా శారీరక సన్నిహితంతో, కలుషితమైన వస్తువులను తాకి, తర్వాత నోరు, ముక్కు లేదా కళ్లను తాకడం వంటి పనుల వల్ల ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి అవుతుంది.
HMPV నివారణ కోసం శుభ్రత జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం 20 సెకండ్లపాటు సబ్బుతో చేతులు కడగాలి. శుభ్రపరచని చేతులతో ముఖం తాకకుండా జాగ్రత్త పడాలి. జలుబు లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. తలుపుల హ్యాండిల్స్, ఆటబొమ్మలు వంటి వస్తువులను శుభ్రపరచాలి. ఒకవేళ వ్యాధి లక్షణాలు కనిపిస్తే నోరు, ముక్కు కప్పుకోవాలి, ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
HMPV కోసం ఇప్పటివరకు ప్రత్యేకమైన యాంటీవైరల్ చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ వైరస్‌తో ప్రభావితమైన వారికి అందించే వైద్య సేవలు ప్రధానంగా ఉండే లక్షణాలను తగ్గించడం లేదా నివారించడం మీద మాత్రమే దృష్టి సారిస్తాయి.
HMPV, COVID-19 వైరస్‌లు రెండూ శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. దగ్గు, జ్వరం, శ్వాసకోశ రుగ్మతలు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ రెండు వైరస్‌లతో కనిపించే ప్రధాన లక్షణాలు. ఈ వైరస్‌లు శ్వాసకోశ తుంపర్లు ద్వారా వ్యాపిస్తాయి. సాధారణంగా చలికాలం, ఉధృతంగా వ్యాపించే HMPV COVID-19 కారణంగా ఏడాది పొడవునా వ్యాప్తి చెందుతుంది. COVID-19 లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక, HMPV కేసులు కొంత ప్రాంతాల్లో మూడు రెట్లు పెరిగాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.