Haunted Place: ఇది మొన్నటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద పిచ్చాసుపత్రి. మానసిక చికిత్సాలయం. ఇప్పుడు మాత్రం దెయ్యాల శాల. దెయ్యాలకు ఆవాసంగా మారిందనే భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. మీకేమైనా సాహసం చేయాలని ఉన్నా లేదా దెయ్యాలుండే ప్రాంతాలు దర్శించాలన్పించినా..ఇది బెస్ట్ ప్లేస్. అమెరికా జార్జియాలో ఉన్న సెంట్రల్ స్టేట్ హాస్పిటల్. ఒకప్పుడు వేలాదిమందికి మానసిక చికిత్స అందించిన ఈ ప్రాంతం ఇప్పుడు దెయ్యాలకు ఆవాసంగా మారిందనే ప్రచారం సాగుతోంది.
ఆసుపత్రిలోని ఓ చిన్న బ్లాకు మాత్రమే ఇప్పుడు యాక్టివ్గా ఉంది. దాదాపు 3 వందలమంది రోగులకు చికిత్స అందుతోందిప్పుడు. 2020లో ఈ ఆసుపత్రిని పర్యాటక ప్రాంతంగా మార్చారు.
స్థానికులు చెప్పినదాని ప్రకారం ఈ ఆసుపత్రి దెయ్యాలకు ఆవాసంగా మారిపోయింది. ఖాళీగా ఉన్న భవంతుల్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటున్నారు. అయితే అధికారికంగా దీనిపై స్పష్టత లేదు.
ఈ పిచ్చాసుపత్రి ప్రాంగణంలో 25 వేలకంటే ఎక్కువమంది రోగుల్ని సమాధి చేశారు. ఆ రోగుల పేర్లతో కూడిన ప్లేట్లు ఆ సమాధుల వద్ద ఉన్నాయి. ఆసుపత్రి పరిస్థితి క్రమంగా దిగజారిపోయింది. రోగులు రావడం తగ్గిపోయింది. దాదాపు వేయి ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలోని 2 వందల బ్లాకుల్లోకి దెయ్యాల్ని పట్టుకునేవాళ్లు రావడం మొదలైంది.
ఈ ఆసుపత్రిలో రోగుల్ని అత్యంత అమానవీయంగా, అమానుషంగా ఉంచి చికిత్స అందించేవారని తెలుస్తోంది. చిన్నారుల్ని ఇనుప పంజరాల్లో బంధించేవారు. పెద్దవారిని బలవంతంగా స్టీమ్బాత్, చల్లని నీళ్లతో స్నానం చేయమని ఒత్తిడి తెచ్చేవారు.
ఈ ఆసుపత్రిని 1842లో నిర్మించారు. 1960 వరకూ ఈ ఆసుపత్రి ప్రపంచంలోనే అతి పెద్ద మానసిక చికిత్సాలయంగా ప్రసిద్దికెక్కింది. ఆ సమయంలో ఒకేసారి 12 వేలమంది కంటే ఎక్కువ చికిత్స తీసుకునేవారు. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా రోగులు తగ్గిపోయారు. ఆసుపత్రిలో ఎక్కువ భాగం శిధిలమైపోయింది. ఇప్పటికీ కొంతమందికి చికిత్స అందుతోంది ఇక్కడ.