మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్ పల్లి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని భావిస్తున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్కడ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ స్థానానికి దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రచారం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అభ్యర్థి పేరును చెప్పకుండా..ప్రచారం చేసుకోవడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళుతాయని.. కాబట్టి, వెంటనే ప్రచారం ఆపాలని ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. సుహాసినికి ఈ స్థానాన్ని కేటాయించాలనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానం పెద్దిరెడ్డికి ఇలా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.
మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. వాటిలో టీడీపీ ఇప్పటికే 9 మంది అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. కూకట్ పల్లి సహా మరో ఐదు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి టికెట్ వ్యవహారం ఇలా వెలుగులోకి వచ్చింది.