పర్యాటక శాఖ ప్రకటనలో 'బీఫ్'.. బీజేపీ, వీహెచ్‌పి ఆగ్రహం!

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవుల్లో పర్యాటకులను ఆకర్షించి, ఆ రద్దీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కేరళ పర్యాటక శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదంలోకి నెట్టేసింది.

Last Updated : Jan 17, 2020, 04:10 PM IST
పర్యాటక శాఖ ప్రకటనలో 'బీఫ్'.. బీజేపీ, వీహెచ్‌పి ఆగ్రహం!

మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవుల్లో పర్యాటకులను ఆకర్షించి, ఆ రద్దీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కేరళ పర్యాటక శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదంలోకి నెట్టేసింది. పసందైన వంటకాలతో ఏర్పాటు చేసిన స్పెషల్ హాలీడే ప్యాకేజీలను ఆస్వాదించాల్సిందిగా కోరుతూ కేరళ పర్యాటక శాఖ మకర సంక్రాంతి రోజున ఓ ట్వీట్ చేసింది. అయితే, ఆ ట్వీట్‌లో 'బీఫ్ ఉలర్తియత్తు' అనే బీఫ్ వంటకాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంపై భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఓవైపు సంక్రాంతి పర్వదినం నాడు హిందువులు గోమాతను పవిత్రంగా భావించి పూజిస్తోంటే.. మరోవైపు అదే రోజున బీఫ్ వంటకాన్ని ప్రత్యేక వంటకంగా వడ్డించనున్నట్టు ప్రకటన ఇవ్వడం ఏంటంటూ బీజేపి, వీహెచ్‌పి ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేరళ పర్యాటక శాఖ ఇచ్చిన ప్రకటన గోమాతను పూజించే వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ వీహెచ్‌పి నేత వినోద్ బన్సాల్ మండిపడ్డారు. అందుకు బాద్యులైన వారిపై, ట్విటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతో పాటు కేరళ సర్కార్ జాతికి క్షమాపణలు చెప్పాలని వినోద్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మరో హిందూ నేత విశ్వనాద్ ఈ వివాదంపై మాట్లాడుతూ.. ''సంక్రాంతి పండగ నాడు బీఫ్ మెనూ ఏర్పాటు చేసిన కేరళ సర్కార్.. రంజాన్ నాడు కూడా ఇలాగే 'పోర్క్' వంటకాలను వడ్డిస్తామని ప్రకటన ఇస్తుందా'' అని సవాల్ విసిరారు.

వినోద్ బన్సాల్ డిమాండ్ పై స్పందించిన కేరళ పర్యాటక శాఖ మంత్రి కే సురేంద్రన్.. కేరళలో ఎవ్వరూ ఆహారాన్ని మతంతో ముడిపెట్టిచూడరని అన్నారు. ఎవ్వరి మత విశ్వాసాలను దెబ్బతీసే ఆలోచన ప్రభుత్వానికి లేదని సురేంద్రన్ వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని వివాదం చేసి మతం రంగు పులమడం అనేది ఖండించదగిన విషయం అని సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. ఎవరైతే ఇందులో మతాన్ని ముడిపెట్టిచూస్తున్నారో.. వారే తిరిగి ''పోర్క్ ఫుడ్ మెనూ'' కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మరో మతపరమైన వివాదానికి తెర తీస్తున్నారని సురేంద్రన్ అసహనం వ్యక్తంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x