నింగిలోకి ఎగిరిన భారత తొలి బయో ఫ్యూయల్ విమానం

భారతదేశానికి చెందిన తొలి  బయో ఫ్యూయెల్‌ (జీవ ఇంధనం) విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజిఐ) ల్యాండ్‌ అయింది.

Last Updated : Aug 28, 2018, 02:15 PM IST
నింగిలోకి ఎగిరిన భారత తొలి బయో ఫ్యూయల్ విమానం

భారతదేశానికి చెందిన తొలి బయో ఫ్యూయెల్‌ (జీవ ఇంధనం) విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజిఐ) ల్యాండ్‌ అయింది. టర్బైన్ ఇంధనానికి బదులు జీవ ఇంధనాన్ని ఉపయోగించి దేశంలో తొలిసారి డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి 72సీట్ల సామర్థ్యంతో ఉన్న స్పైస్ జెట్ విమానాన్ని నడిపారు. విమాన నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వ్యవసాయ వ్యర్థాలు, నాన్ ఎడిబుల్ ఆయిల్స్, పారిశ్రామిక, పురపాలక వ్యర్థాల నుంచి జీవ ఇంధనం తయారు చేసినట్లు స్పైస్ జెట్ సిబ్బంది తెలిపారు. బయో ఫ్యూయెల్ ట్రయిల్ ఫ్లైట్‌ను డెహ్రాడూన్‌కు చెందిన సీఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం రూపొందించింది. ఈ విమానంలో 75 శాతం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ (ఎటిఎఫ్‌)ను, 25 శాతం బయో ఫ్యూయెల్‌ను ఉపయోగించారు.

స్పైస్ జెట్ విమానాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్టులో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డీసీజీఏ అధికారులు, స్పైస్ జెట్ సిబ్బందితో సహా మొత్తం 20 మంది ప్రయాణించి సురక్షితంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఢిల్లీలో స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానాశ్రయం వద్ద కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ హర్ష్ వర్ధన్, జయంత్ సిన్హా ఉన్నారు.

ఏవియేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో ఇది పెద్ద అచీవ్‌మెంట్ అని, ఆగస్టు 10న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన బయో ఫ్యూయెల్ పాలసీని ప్రకటిస్తారని, బయోడీజిల్, ఇథనాల్‌లపై  జీఎస్టీ తగ్గిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలోనే బయో- ATF (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) విధానాన్ని తీసుకువస్తుందని, రాబోయే రోజుల్లో బయో-ఎనర్జీపై దృష్టి కేంద్రీకరిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

 

 

 

Trending News