దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే భారత జవాన్ల కు కేంద్రం తీపి కబురు వినిపించింది. పారా మిలిటరీ బలగాల పదవీ విరమణ వయోపరిమితి 60 ఏళ్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో 57 ఏళ్లుగా ఉన్న వయోపరిమితి కాస్త మరో మూడేళ్లు పొడిగించినట్లయింది.
తక్షణమే ఉత్తర్వులు అమలు
పదవీ విరమణ వయో పరిమితి పెంపు నిర్ణయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బీ), అస్సాం రైఫిల్స్ (ఏఆర్) కు వర్తిస్తుంది. కాగా తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానుంది.
కోర్టు ఆదేశాల మేరకు...
పారా మిలిటరీ బలగాల్లో పని చేస్తున్న సిబ్బందికి ఒకే రకమైన నిబంధనలు పాటించాలని ఏడాది జనవరి 31న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.