తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: అమిత్‌షా

ఎన్డీఏలోకి కొత్త స్నేహితులను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు.

Last Updated : Jul 10, 2018, 10:43 AM IST
తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది: అమిత్‌షా

ఎన్డీఏలోకి కొత్త స్నేహితులను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఒక్కరోజు పర్యటనకై చెన్నై వచ్చిన ఆయన నగర శివారులో వీజీబీ గోల్డెన్ బీచ్ వద్ద శక్తి కేంద్ర, మహాశక్తి కేంద్ర సంస్థల నిర్వాహకులు, నగరంలోని ప్రముఖులతోను ఆయన సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు కుదుర్చుకోవడంపై అమిత్‌ షా స్థానిక నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

లోక్‌సభ ఎన్నికలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిత్రధర్మాన్ని పాటిస్తూ.. బంధానికి గౌరవమిస్తూనే కొత్తవారిని చేర్చుకుంటామన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేస్తే తమిళనాట ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేసేలా కమల సారథి ఈ పర్యటన చేశారు.

చెన్నైలో అమిత్‌షా పర్యటించిన నేపథ్యంలో నగరవ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. అమిత్‌ షా పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టి, పెద్ద సంఖ్యలో పోలీసులు నగరవ్యాప్తంగా మోహరించారు. అమిత్‌ షా పాల్గొన్న వేదికల వద్ద పోలీసు భద్రతను పటిష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు తమ జాతీయ అధ్యక్షుడికి చెన్నై అంతర్జాతీయ  విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. వీరిలో రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్రమంత్రి పొన్‌.రాధాకృష్ణన్ తదితరులు ఉన్నారు.

Trending News