కేబీసీ సీజన్10లో చరిత్ర సృష్టించిన బినిత జైన్‌

కేబీసీ సీజన్ 10లో చెప్పలేకపోయిన రూ.7 కోట్ల ప్రశ్న ఇదే..!

Updated: Oct 9, 2018, 10:03 PM IST
కేబీసీ సీజన్10లో చరిత్ర సృష్టించిన బినిత జైన్‌

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ కార్యక్రమాల్లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ఒకటి. కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 10వ సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. ఈ షోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అస్సాంకి చెందిన బినిత జైన్‌ అనే ట్యూటర్ హాట్ సీట్‌లో కూర్చొని.. కేబీసీ సీజన్ 10లో రూ.కోటి గెల్చుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. బినిత జైన్‌ మొదటి 14 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ.కోటి గెల్చుకున్నారు.

బినిత జైన్‌‌కు ఇద్దరు పిల్లలు. 2003లో భర్త బిజినెస్ ట్రిప్‌కి వెళ్లగా టెర్రరిస్టుల కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆ కుటుంబం భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది. భర్త లేకపోవడంతో ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో కుటుంబ పోషణ భారాన్ని మోసింది బినిత. ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. తన భర్త మరణించినట్లు అధికారికంగా వెల్లడించినా.. ఎప్పటికైనా తండ్రి తిరిగి వస్తారని పిల్లలు, భర్త జీవించే ఉన్నారని భార్య అంటున్నారు. ఈ విషయాన్ని కేబీసీ హాట్ సీట్‌లో కూర్చున్న బినిత చెప్పడంతో బిగ్‌బి కళ్లు చెమర్చారు. ఆమె సంకల్పాన్ని అభినందిస్తూ.. యువత ఆమెను ప్రేరణగా తీసుకోవాలన్నారు.

సోనీ టీవీలో ఈ నెల 3 నుంచి ప్రారంభమయిన ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎవరూ 14వ ప్రశ్న వరకు చేరుకోలేకపోయారు. గత వారంలో 14వ ప్రశ్న వరకు వచ్చిన బినిత జైన్.. మంగళవారం ఎపిసోడ్‌లోనూ పాల్గొన్నారు. అప్పటికే బినిత జైన్ రూ.కోటి గెలుచుకున్నారు.

మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమయ్యాక.. బిగ్ బి '1867లో తొలిసారి స్టాక్ టికర్‌ను ఎవరు కనుగొన్నారు?(స్టాక్ టికర్ అనేది టెలిగ్రాఫ్ ప్రింటర్స్‌లో ఉపయోగిస్తారు)' అని చివరి ప్రశ్న అడిగారు. దీనికి బినిత జైన్‌ సమాధానం చెప్పలేదు. సమాధానం తెలియదని.. గేమ్ నుంచి నిష్క్రమిస్తానని చెప్పింది. దీంతో ఆమెకు రూ. కోటి చెక్కును అమితాబ్ అందజేశారు. బిగ్ బి అతృతతో.. ఒక వేళ దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో ఊహించగలరా? అని అడగ్గా ఎడ్వర్డ్ ఎ.కలహన్ అని చెప్పడంతో బిగ్ బి అవాక్కయ్యారు. కారణం.. పై ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ అదే..!

బినిత జైన్ రూ.కోటితో పాటు మహీంద్రా మరాజో కారుని కూడా బహుమతిగా గెల్చుకున్నారు.

బినిత గేమ్ ఆడే సమయంలో అమితాబ్ బచ్చన్‌కి టీని బహుకరించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ అస్సాంలో పెరుగుతుందని..ఈ టీ పేరు గిన్నీస్ బుక్ రికార్డ్‌లో కూడా ఎక్కిందని అన్నారు.