తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం తనను గెలిపించిన వయనాడ్ వాసులకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిన్న శనివారమే కేరళకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడ నేడు కొజికోడ్‌లో పర్యటిస్తున్నారు. కొజికోడ్ పర్యటనలోనే ఆయన ఇవాళ రాజమ్మ అనే పదవీ విరమణ చేసిన నర్సును కలిశారు. తాను జన్మించినప్పుడు తన తల్లికి పురుడుపోసిన నర్సులలో ఒకరైన రాజమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకీ ఈ రాజమ్మ అంటే ఎవరో గుర్తొచ్చింది కదా.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఈ వివాదంపై స్పందిస్తూ ఆయన భారతీయుడే అని, అందుకు తానే సాక్ష్యమని ధైర్యంగా ప్రకటించి రాహుల్ గాంధీకి అండగా నిలిచిన మహిళే కేరళకు చెందిన రాజమ్మ వవథిల్.
1970లో జూన్ 19న ఢిల్లీలోని హాలి ఫ్యామిలీ ఆస్పత్రిలో సోనియా గాంధీ ప్రసవ వేదనతో రాహుల్ గాంధీకి జన్మనిచ్చినప్పుడు తాను కూడా అదే ఆస్పత్రిలో ట్రైయినీ నర్సుగా పనిచేశానని.. పుట్టిన వెంటనే శిశువును ఎత్తుకున్న వారిలో తాను ఒకరిని అని అప్పట్లో రాజమ్మ ప్రకటించింది. శిక్షణ పూర్తయిన అనంతరం మిలిటరీ ఆస్పత్రిలో నర్సుగా చేరిన రాజమ్మ ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని కేరళలో స్థిరపడ్డారు.