తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే ఏపీకి ఎయిమ్స్ మంజూరు కాగా.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు సమాచారం అందించింది. అయితే, ఎయిమ్స్ ఏర్పాటుకు కావాల్సిన భూమి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రం అధీనంలోకి వస్తేనే ఇతర అంశాలను పట్టించుకుంటామని స్పష్టం చేసింది. గతంలో పలు కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలోనే కేంద్ర మంత్రులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తావించింది.
సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతులు
ఇప్పటికే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ కార్యకలాపాలు ప్రారంభించగా, తాజాగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చింది. సూర్యాపేట, నల్లగొండల్లో కూడా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఎయిమ్స్ ఏర్పాటు వల్ల రాష్ట్రంలో అత్యవసర, మెరుగైన, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తాజాగా ఎయిమ్స్‌కు కేంద్రం అనుమతించడంతో వచ్చే ఏడాదితో కలుపుకొని మొత్తం ఐదు ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థలు వచ్చినట్లయిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు ఎయిమ్స్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్