Rahu Ketu Dosha Nivarana Puja: హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగియనుండగా... నవరాత్రులలో దుర్గా మాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నవ గ్రహాలు శాంతించడంతో పాటు నవగ్రహాల వల్ల ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోతాయి.
Rahu Ketu Dosha Nivarana Puja: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో రాహువు, కేతువుల వల్ల ఎవరికైనా దోషం ఉన్నట్టయితే.. ఆ వ్యక్తి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం, ఆర్థికంగా ఎదుగుదల లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతుండటం, ప్రేమ, పెళ్లి విషయాల్లోనూ అడ్డంకులు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, అలా రాహు, కేతు దోషంతో బాధపడే వారికోసమే కొన్ని దోష నివారణ చర్యలు కూడా ఉన్నాయి. ఆ దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల నవగ్రహాలు శాంతించడమే కాకుండా ముందు చెప్పుకున్నట్టుగా అన్ని సమస్యల నుండి బయటపడే మార్గం లభిస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా ఒక వ్యక్తి జాతకంలో రాహు దోషం ఉన్నట్టయితే, వారు నిష్ట, నియమాలను అనుసరిస్తూ మా బ్రహ్మచారిని పూజ చేయాలి. ఒకవేళ మీరు కేతువు దోషంతో బాధపడుతున్నట్లయితే, చంద్రఘంట మాతను పూజించండి. చంద్రఘంట మాత అంటే దుర్గా మాత అవతారాల్లో మూడవది. అందుకే నవరాత్రులలో మూడో రోజున అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తారు. నవరాత్రులలో ఈ దేవతలను పూజిస్తే రాహు, కేతు దోషాలు తొలగిపోయి ఇకపై వారికి అంతా శుభమే కలుగుతుంది.
స్నానం చేసే నీళ్లలో గంధపు పొడిని కలిపి స్నానం ఆచరిస్తే జాతకంలో ఉన్న రాహు దోషాలు తొలగిపోతాయి. ఈ ఫలితం ఎక్కువగా కనపడాలంటే నవరాత్రుల సమయంలో ఈ తరహా నియమాలు పాటించి అలా 3 నెలల పాటు నిరంతరం కొనసాగిస్తే.. అప్పుడు మరింత అధిక ప్రయోజనం కనిపిస్తుంది.
నవరాత్రుల్లో దుర్గా మాతతో పాటు హనుమంతుడిని, శివుడిని పూజిస్తే.. రాహు, కేతువులు ఇక మీ దిక్కు కూడా తొంగి చూడరు. నవరాత్రుల సమయంలో ప్రతీరోజూ శివసహస్త్రాణం, హనుమాన్ సహస్త్రాణం పారాయణం చేసినట్టయితే.. రాహు కేతువుల దోషాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది.
ఒకవేళ రాహు దోషం బాధితుల జాబితాలో మీరు కూడా ఉన్నట్టయితే.. నవరాత్రులు పాటించే సమయంలోనే ఒక వెండి ఏనుగు ప్రతిమను కొనుగోలు చేయండి. ఆ ఏనుగు ప్రతిమను పూజ గదిలో కానీ లేదా నగదు, బంగారం, ఆస్తి పత్రాలు దాచిపెట్టే ఖజానాలో కూడా దాచిపెట్టొచ్చు. అలా చేయడం వల్ల మీ జాతకంలో రాహువుతో కలిగే కీడు ప్రభావం తగ్గడంతో పాటు మీరు చేసే పనిలో, వృత్తిలో పైకి ఎదుగుతారు.
Rahu Ketu Dosha Nivarana Puja - దుర్గా సప్తశతి పారాయణం: చైత్ర నవరాత్రులలో 9 రోజులు పాటు దుర్గా సప్తశతి పఠిస్తే.. రాహు కేతువుల వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి. దుర్గా సప్తశతి పారాయణం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందడంతో పాటు రాహు, కేతులతో ఎదురయ్యే ఇబ్బందులను దూరం పెడుతుంది. ( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన సమాచారం సమాజంలోని విశ్వాసాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )