Ganesh Immersion Along With Gold Chain Worth 4 Lakhs: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినాయక నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేషుని కొందరు మూడు రోజులు, ఐదు, తొమ్మిది రోజులపాటు ఇంట్లో నెలకొల్పి చివరిరోజు నిమజ్జనం చేస్తారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ జంట కూడా ఇలాగే చేశారు. కానీ, వారు వినాయకుడితోపాటు పొరపాటున రూ.4 లక్షల విలువ చేసే బంగారాన్ని కూడా నిమజ్జనం చేసేసారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
బెంగళూరుకు చెందిన ఓ టీచర్ కుటుంబానికి వినాయక చవితి ఉత్సవాల్లో అనుకోని ఘటన ఎదురైంది. వీళ్లు గోవిందనగర్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వినయాక చవితి అంటే సెప్టెంబర్ 7న గణేశ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అయితే, విగ్రహాన్ని అలంకరించేటప్పుడు తమ వద్ద ఉన్న రూ.4 లక్షల విలువ చేసే బంగారు గొలుసును కూడా గణపయ్యకు అలంకరించారు.
ఆ తర్వాత నిమజ్జనం చేసే సమయం ఆసన్నమైంది. వారు గణపతి మెడలో పూలు పత్రితోపాటు బంగారు గొలుసు ఉన్న విషయం మరచిపోయారు. వారి ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ మొబైల్ ట్యాంకులో వినాయకుని పొరపాటున బంగారు గొలుసుతోపాటు నిమజ్జనం చేసి ఇంటికి వెళ్లిపోయారు.
కాసేపటి తర్వాత గోల్డ్ చైన్ గురించి గుర్తొచ్చిన ఆ జంట వెంటనే మళ్లి మొబైల్ ట్యాంక్ వద్దకు వెళ్లి అక్కడి అధికారుల సాయం తీసుకుని గాలించారు. అయితే, వినాయకుడి నిమజ్జనం సమయంలోనే మెడలో గొలుసు చూశానని అక్కడ ఉన్న ఓ వ్యక్తి చెప్పాడు. కానీ, అది రోల్డ్‌గోల్డ్ అయి ఉంటుందని అనుకున్నాను అని చెప్పాడు.
అయితే, అక్కడ ఉన్నవారు వెంటనే ఆ మొబైల్ ట్యాంకులో వెతకడం ప్రారంభించారు. అప్పటికే చాలా విగ్రహాల నిమజ్జనం జరగడం వల్ల మట్టి ఎక్కువగా పేరుకుపోయింది. ఎన్నో గంటలు కష్టపడ్డారు అయినా దొరకలేదు. చేసేదేం లేక ఆ ఉపాధ్యాయ జంట మగదీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి స్థానిక ఎమ్మెల్యే సాయంతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ఓ పది గంటలపాటు విస్త్రతంగా వెతికిన తర్వాత బంగారు గొలుసు దొరికింది. దీంతో ఆ ఉపాధ్యాయ జంట ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే ఆ ట్యాంక్‌లో 300 విగ్రహాలు నిమజ్జనం చేశారు. ఈ బంగారు గొలుసును వెతకడానికి మొత్తంగా ఆ మొబైల్ ట్యాంక్ నుంచి 10 వేల లీటర్ల నీటిని కూడా తోడాల్సి వచ్చింది.