Haryana Election Results 2024: తీవ్ర ఉత్కంఠ రేపిన హర్యానా ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మొదటి రెండు రౌండ్లలో పూర్తి ఆధిక్యం కనబర్చిన కాంగ్రెస్.. ఆ తరువాత క్రమంగా వెనకబడిపోయింది. నెమ్మదిగా పుంజుకున్న బీజేపీ.. 48 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. వరుసగా హర్యానాలో అధికారంలోకి వచ్చిన తొలి పార్టీగా రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ రెండు సీట్లు గెలుచుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు మూడు సీట్లు గెలుచుకున్నారు. ఇక ఐదు స్థానాల్లో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనగా.. కేవలం 32 ఓట్ల నుంచి 1,957 ఓట్ల తేడాతో గెలుపొందారు. వాళ్లేవరో ఇక్కడ చూద్దాం..
బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి ఉచన కలాన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్‌పై కేవలం 32 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అత్రికి మొత్తం 48,968 ఓట్లు రాగా.. సింగ్‌కు 48,936 ఓట్లు వచ్చాయి.
దబ్వాలి స్థానం నుంచి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి ఆదిత్య దేవిలాల్ కేవలం 610 ఓట్ల తేడాతో గెలుపొందారు. దేవిలాల్‌కు 56,074 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి సిహాగ్‌కు 55,464 ఓట్లు వచ్చాయి.
లోహారు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బీర్ ఫర్టియా 792 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని జై ప్రకాష్ దలాల్ ఓడించారు. ఫర్టియాకు 81,336 ఓట్లు రాగా, దలాల్‌కు 80,544 ఓట్లు వచ్చాయి.
రోహ్‌తక్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మనీష్ కుమార్ గ్రోవర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ బత్రా 1,341 ఓట్ల తేడాతో గెలుపొందారు. భూషణ్ బత్రాకు 59,419 ఓట్లు రాగా.. మనీష్ కుమార్ గ్రోవర్‌పై 58,078 ఓట్లు సాధించారు.
దాద్రీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సునీల్ సత్పాల్ సంగ్వాన్ కాంగ్రెస్ అభ్యర్థి మనీషా సాంగ్వాన్‌పై 1,957 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
హర్యానాలో బీజేపీ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలపై ప్రజలు స్పష్టమైన ముద్ర వేశారని అన్నారు.