Story Of Success Nirma Company Karsanbhai Patel Lifestory: వాషింగ్ పౌడర్ నిర్మా అనే వాణిజ్య ప్రకటన నాటి తరాన్ని.. నేటి తరానికి బాగా గుర్తుండేది. ప్రస్తుతం అనేక సబ్బు కంపెనీలు వచ్చినా నిర్మా ప్రత్యేకత దానిదే. వేల కోట్ల కంపెనీగా నిర్మా కంపెనీ ఎదిగిన కథ మాత్రం చాలా ఆదర్శవంతం. ఇంటింటికి సబ్బులు అమ్ముతూ కర్సాన్ భాయ్ ఇప్పుడు ప్రముఖ కంపెనీగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఇదే.
దేశీయ కంపెనీ విజయ సూత్రం: సబ్బు ఉత్పత్తుల కంపెనీల్లో ప్రముఖ సంస్థ నిర్మా కంపెనీ. ప్రస్తుతం అత్యధిక సబ్బు ఉత్పత్తులు అమ్ముడవుతున్న సంస్థ కూడా నిర్మా. ఈ కంపెనీని ప్రారంభించిన కర్సాన్భాయ్ పటేల్. ఈ కంపెనీ చరిత్ర, ఆస్తిపాస్తుల వివరాలు ఇవే.
గుజరాత్లో ప్రారంభం: గుజరాత్‌లోని రుప్పూర్లో కర్సాన్భాయ్ పటేల్ 1945లో పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆర్థిక కష్టాలతో బాల్యం గడిపిన ఆయన తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలు పడ్డారు.
ల్యాబ్ టెక్నీషియన్: భౌతిక శాస్త్రంలో విద్య పూర్తి చేసిన కర్సాన్భాయ్ పటేల్ ప్రభుత్వ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేశారు. తక్కువ జీతానికి పని చేస్తున్న అతడు సొంతంగా ఎదగాలని తాపత్రయపడేవాడు. తానే వ్యాపారం చేయాలని భావించాడు.
1969లో నిర్మా ప్రారంభం: చాలా మంది ఖరీదైన డిటర్జెంట్లను (సబ్బు) కొనలేరని గుర్తించిన కర్సాన్ భాయ్ పటేల్ సబ్బుల వ్యాపారం ప్రారంభించాలని చూశాడు. 1969లో రూ.15,000 రుణంతో తన ఇంటి నుంచి డిటర్జెంట్ పౌడర్‌ను (సర్ఫ్) తయారు చేయడం ప్రారంభించాడు. ఆ పౌడర్‌కు నిర్మా అని పేరు పెట్టారు.
సైకిల్‌పై ఇంటింటికి: నిర్మా సర్ఫ్‌ను తయారుచేసి ఆ తర్వాత తన సైకిల్‌పై ఇంటింటికీ వెళ్లి విక్రయించాడు. అతి తక్కువ ధరకు మురికిని వదిలే నాణ్యమైన సర్ఫ్‌ను అందించడంతో ప్రజల నుంచి విశేష ప్రాచుర్యం పొందింది. ప్రజల నుంచి ఊహించని స్పందన రావడంతో విక్రయాలు పెరిగాయి.
నిర్మా కంపెనీ విస్తరణ: ఇంటింటికి పంపిణీ చేస్తున్న క్రమంలో నిర్మాకు డిమాండ్ పెరగడంతో కర్సాన్ భాయ్ పటేల్ చిన్నస్థాయిలో తయారీ యూనిట్‌ను అద్దెకు తీసుకున్నాడు. డిటర్జంట్ల ఉత్పత్తిని పెంచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించారు. కొన్నాళ్ల తర్వాత సర్ఫ్తోపాటు సబ్బులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు విస్తరించారు. వీటికి గొప్ప ఆదరణ రావడంతో నిర్మా కంపెనీ విస్తరించింది.
నిర్మా గ్రూప్ విజయం: అనేక చోట్ల తయారీ యూనిట్లను నెలకొల్పిన నిర్మా లిమిటెడ్‌లో దాదాపు 18,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆ కంపెనీ ప్రస్తుతం రూ.7,000 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తోంది. నిర్మా గ్రూప్ మొత్తం టర్నోవర్ రూ.23,000 కోట్లను అధిగమించింది.
అవార్డులు, గుర్తింపు: స్వదేశంలో దేశీయ కంపెనీగా నిర్మా గుర్తింపు పొందింది. కర్సన్భాయ్ పటేల్ వ్యాపార విజయాన్ని గుర్తించడంతో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. 1990లో ఉద్యోగ రత్న, 2006లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వచ్చాయి.