BRS MLA Jeevan Reddy Challenges Dharmapuri Aravind: నిజామాబాద్ ఎంపీ అరవింద్.. నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ నియోజకవర్గంలో నాపై పోటీ చెయ్యి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్ కి సవాల్ విసిరారు. నాతో యుద్దానికి సిద్ధమా అంటూ తొడగొట్టి ప్రశ్నించారు. తొడగొట్టి చెబుతున్నా నిన్ను పడగొట్టి పాతి పెడతా.. నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి జీవన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరియర్ క్లోజ్" అని నిప్పులు చెరిగారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన 500 మందికి పైగా యువకులు, వివిధ కుల సంఘాల నాయకులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ అరవింద్ అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తాం అని హెచ్చరించారు. అంబేద్కర్ చౌరస్తాలో బట్టలూడదీసి కొడతాం అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. "నీకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధిపై చర్చకురా. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో నీ వాటా ఎంతో చెప్పు. 3వేల కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సీడీల రూపంలోనే రూ.320 కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.3016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. 12 వందల మందికి దళిత బంధు పథకం ద్వారా రూ. 10 లక్షల చొప్పున వచ్చి వారికి ఇష్టమైన యూనిట్లు పెట్టుకొని ఆత్మ గౌరవ పతాకను ఎగురేస్తున్నారు అంటూ తన నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను వెల్లడించారు.
ఆర్మూరులో ధర్మపురి అరవింద్ చేసింది రోడ్ షో కాదు.. మ్యాడ్ షో. అదొక బ్యాడ్ షో. ఆర్మూర్ నియోజకవర్గాన్ని నిండా ముంచే కుట్రతో చేసిన వెకిలి చేష్టలు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బొంద పెడతాం. కర్ణాటక ప్రజలు చెప్పుతో కొట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు అని ఎద్దేవా చేశారు. బజరంగ్ దళ్ ని నిషేధిస్తాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ.. అక్కడి ప్రజలు బీజేపీని ఆదరించలేదు అంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. అరగుండు అరవింద్ ఎన్ని చిల్లర వేషాలేసినా నేను 60వేల మెజారిటీతో మూడోసారి కూడా గెలుస్తా. కవితక్కపై నీకెందుకంత అక్కసు. మంత్రి కేటీఆర్ ని విమర్శించే స్తాయా నీది. వారి కాలిగోటికి కూడా అరవింద్ సరిపోడు అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం చూసి సకల జనుల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే లభిస్తోంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.