Bhatti Vikramarka on Rythu Bandhu Scheme: ప్రజల అవసరాల విద్యుత్తు డిమాండ్‌కు తగ్గట్టుగా గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేసిందని, రాష్ట్ర చరిత్రలో ఈ నెల 8న 15,623 మెగావాట్ల విద్యుత్తును అత్యధికంగా సరఫరా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. శనివారం డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటి సీఎం మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదని తప్పుడు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడు మాసాల్లో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేశామని గణంకాలతో సహా వెల్లడించారు.
Also Read: KN Rajannna: జై పాకిస్థాన్ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్‌లో 200 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేసిందని భట్టి తెలిపారు. అలాగే 2023 జనవరి నెలలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 జనవరిలో 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు. 2023 ఫిబ్రవరి నెలలో 263.38 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 ఫిబ్రవరిలో 272.85 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు.
2023 మార్చి నెలలో 289.78 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 మార్చిలో 295.21 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేసినట్టు చెప్పారు. రానున్న ఏప్రిల్, మే నెలలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరుగనుందని, దీనికి అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రానున్న వేసవిలో గరిష్ట వినియోగం 16,500 మెగవాట్ల విద్యుత్తుకు చేరినప్పటికి తట్టుకొని నిలబడి పీక్‌టైంలో సరఫరా చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఒక నాయకుడు మాట్లాడే సమావేశంలో మైక్ కట్ అయితే కరెంటు పోయిందని ట్విట్ చేశాడని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్తును అందిస్తామన్నారు. ప్రజాపాలన లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్ ను సరిగ్గా పొందు పరిచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల జీరో బిల్లు వచ్చిందన్నారు. దరఖాస్తులో పొరపాటున తప్పులు పడిన వారికి జిరో బిల్లు రాకపోయి ఉండవచ్చన్నారు. వీరు వెంటనే ఎంపిడివో కార్యాలయం వెళ్లి అక్కడ ఉన్న ప్రజపాలన అధికారికి తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన తరువాత జీరో బిల్లు వస్తుందని వివరించారు.
"గత ప్రభుత్వం కొండలు, గుట్టలు ఉన్న బడా బాబులకు 20 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పేరిట ఇచ్చినట్టు ఇటీవల పేపర్లో చదివాను. ఇది ప్రజల సొమ్ము. ప్రతి పైస ప్రజలకు ఉపయోగపడాలి. దుర్వినియోగం కావడానికి వీలులేదు. అందుకనే మేం ప్రకటించిన గ్యారంటీల అమలుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పకడ్భందీగా చర్యలు చేపట్టాం. గత ప్రభుత్వం యాసంగి సీజన్లో 5 నెలల వరకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేసింది. కానీ మేము ప్రాధాన్యత క్రమంలో వ్యవసాయం చేసే వారిని ప్రోత్సహించాలని రైతు భరోసా డబ్బులను మొదట ఎకరం లోపు, ఆ తరువాత రెండు, మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేశాము. నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేస్తున్నాము. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు త్వరలోనే డబ్బులు జమ చేస్తాం.." అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నామని, ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డి లేకుండా లక్ష కోట్ల రూపాయలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లుగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈనెల 12 న హైదరాబాద్‌లో వడ్డీలేని రుణాల పథకాన్ని డ్వాక్రా మహిళ కొరకు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. సమాజంలో సగ భాగం ఉన్న మహిళలను ఆర్ధికంగా చేయుతను అందించి, ఆర్ధిక స్వాలంభన కల్పించడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మహిళలను వ్యాపార వేత్తలుగా కాదు, పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీ పార్కులను సైతం త్వరలోనే తీసుకువస్తున్నామన్నారు.
Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter