తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఆయన్ను పార్టీ నుంచి తొలగించాలని తెలంగాణ పొలిటిబ్యూరో తీర్మానించింది. ఈ మేరకు తమ అధినేత చంద్రబాబుకు లేఖ రాసింది. పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డి పై వేటు వేయాలని లేఖలో పేర్కొంది.
గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనే బలంగా ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ కలిశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా రేవంత్ ఈ అంశంపై స్పందించలేదు. తోటి నేతలు గట్టిగా నిలదీసినప్పుడు.. ఏదైన ఉంటే పార్టీ అధినేతతో చెబుతానని రేవంత్ వెల్లడించారు.
కాంగ్రెస్ లో చేరిక అంశంపై రేవంత్ ఇప్పటి వరకు ఖండించలేదని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో పేర్కొంది. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఆయనపై వేటు వేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.