పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మరియు తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 18వ తేదిన ఆ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉండబోతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్నందునే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రెసిడెంట్ మెమనూన్ హుస్సేన్ తన విదేశీ పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారని కూడా తెలుస్తోంది.
అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అతిధుల జాబితాను కూడా తయారుచేసే పనిలో పడ్డారట ఆయన వ్యక్తిగత సిబ్బంది. దేశ విదేశాల ప్రముఖులెందరో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ నుండి కూడా పలువురు క్రికెటర్లకు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు సమాచారం. భారత్ మాజీ క్రికెటర్లు అయిన కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మొదలైన వారు అతిధుల జాబితాలో ఉన్నట్లు వినికిడి.
1971లో టెస్టు క్రికెట్, 1974లో వన్డే క్రికెట్‌తో కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు, 175 వన్డేలు ఆడారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. 1990ల్లో యూనిసెఫ్‌కు క్రీడా ప్రతినిధిగా కూడా ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ లాంటి దేశాలలో యూనిసెఫ్ తరఫున ఆరోగ్య కార్యక్రమాలకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. రాజకీయ రంగంలోకి వచ్చాక పాకిస్తాన్‌లో మొదటి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వైద్యశాలను ఏర్పాటు చేయడంలో ఇమ్రాన్ ఖాన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు.
1996లో పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. 1999లో ముషారఫ్ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. 2013లో ముస్లిం లీగ్ పార్టీ వైపు ధ్వజమెత్తారు. 2018 ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సొంతం చేసుకొన్న పార్టీగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్‌లో అవతరించగా.. ఇతర పార్టీ సభ్యుల మద్దతు కూడా కూడగట్టి ప్రధాని పీఠం ఎక్కేందుకు ఇమ్రాన్ ఖాన్ సన్నద్ధమవుతున్నారు.