కర్ణాటక ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. మరుసటి రోజు నుంచి చమురు సంస్థలు పైసా పైసా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆదివారం ముంబైలో దేశ చరిత్రలోనే లీటర్ పెట్రోల్ ధర రూ.84.07కు చేరుకుంది. పెట్రోల్ ధర దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోకీ అత్యధికంగా ముంబైలో ఉండగా.. డీజిల్ మాత్రం దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో రూ.73.36కు చేరుకుంది. ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 80.66, డీజిల్ 73.36గా ఉండగా.. సోమవారం లీటర్ పెట్రోల్ రూ.81.01గా, డీజిల్ రూ.73.63గా నమోదైంది.
నగరంలో 5 ఏళ్ల కిందట మే 24, 2013లో పెట్రోల్ ధర లీటర్ రూ.81.44కు చేరుకొని ఆల్ టైం రికార్డు ధరకి చేరుకుంది. కాగా మే 14 నుంచి హైదరాబాద్ నగరంలో పెట్రోల్ రూ.1.53పైసలు, డీజిల్ రూ.1.56పైసల మేర పెరిగింది. రానున్న రెండు వారాల్లో పెట్రోల్ ధర రూ.85-87కు చేరుకోవచ్చని పెట్రోలియం డీలర్ల అంచనా.
విపక్షాలు భగ్గు
పెట్రో ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ముంబైలో పెట్రోల్ ధర రూ.84కు చేరుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఇదే గరిష్ట ధర అని విమర్శించింది. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర బీజేపీయేతర పార్టీలు కూడా పెట్రో ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని ఆవేదన వెలిబుచ్చారు.
కాగా చమురు ధరల పెరుగుదలపై పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. భారత ప్రభుత్వం త్వరలో దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తుందని అన్నారు.
లీటర్ పెట్రోల్ రూ.86కి చేరినా ఆశ్చర్యమే