మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రాలతో పాటు ఇతర శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతిలతో పాటు భీమేశ్వరం, కాళేశ్వరం తదితర శైవక్షేత్రాల్లో తెల్లవారుఝాము నుండే భక్తులు శివాలయాలకు జనాలు పోటెత్తారు. బిల్వార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ రాజన్న ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని తదితర ప్రాంతాల్లోని ప్రముఖ శివాలయాలు కూడా ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
గుంటూరు జిల్లా కోటప్పకొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. సుమారు 20కి పైగా భారీ ప్రభలు త్రికోటేశ్వరుని ముందు కొలువుదీరాయి. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నేడు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని, నేడు రెండు లక్షల మంది వరకూ దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రమంతా మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. విజయవాడ ఇంద్రకీలాద్రి మాత్రం బోసిపోతోంది. కొండపై ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు జరగడం లేదు. కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులలో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్దరణ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు రద్దయ్యాయి.