విజయవాడ: మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వార్త రాజకీయవర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేత.. ఇప్పుడే పురుడుపోసుకున్న జనసేనలో ఎందుకు చేరినట్లు అని తెగ చర్చించుకుంటున్నారు. రాజకీయ అవసరాలే ఇరువురిని దగ్గర చేసిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని మించిన మరో కారణం ఉంది....
ఆ బంధమే కలిపింది..
వాస్తవానికి నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ ఒకటిగా మారడానికి కారణం రాజకీయ అవసరాలను మించి మరోకటి ఉంది...అదే స్కూల్ బంధం..నాదెండ్ల మనోహర్, తాను ఒకే స్కూలులో చదువుకున్నామని పవన్ కల్యాణ్ స్వయంగా పేర్కొన్నారు. అమరావతిలో ఈ రోజు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం నాదెండ్ల మనోహర్, ఇతర నేతలతో కలిసి పవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ఈ విషయాన్ని బయటపెట్టారు.
సహాయక చర్యల్లో జనసేనికులు
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ రాకతో జనసేన మరింత బలోపేతం అయిందని తెలిపారు. పార్టీ పెట్టినప్పటి మనోహర్ నుంచి తనకు గైడ్ చేశారని.. ఆయన విలుమైన సూచనలు, సలహాలు తీసుకొని అమలు చేశామని పవన్ తెలిపారు. రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలని తామిద్దరం గట్టిగా నమ్ముతామని.. అదే మమ్మల్సి కలిపిందని పవన్ ఉద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.