తండ్రిని మించిన తనయుడు.. అదేనండి సుదీర్ఘ పాయాత్రలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని తనయుడు జగన్ మించిపోయారు..... ఆనాడు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1460 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేయగా..ఈనాడు జగన్ 3 వేల 648 కిలీ మీటర్ల తన సుదీర్ఘయాత్రతో ఆ రికార్డును తిరగరాశారు. కాగా ఆ పాదయాత్ర వైఎస్ఆర్ ను అధికారాన్ని కట్టబెట్టింది..ఈ పాదయాత్ర వైఎస్ జగన్ కు అదే ఫలితాన్ని ఇస్తుందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతుంది.. ఈ క్రమంలో వైఎస్ పాదయాత్ర- జగన్ పాదయాత్రను పోల్చుతూ ప్రత్యేక స్టోరీ మీకోసం...
వైఎస్ పాదయాత్ర : అధికారాన్నికట్టబెట్టిన హామీలు
సరిగ్గా 16ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్న జాతీయ పార్టీ. 2004 ఎన్నికల్లో అధికారం చేపట్టి..పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేయాలని వైఎస్ కంకణం కట్టుకున్నారు. అలా 2003లో మండువేసవిలో 1,460 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం, జలయజ్ఞాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి వైఎస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.
జగన్ పాదయాత్ర: 'నవరత్నాలు' ఫలితాన్ని ఇస్తాయా ?
ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో ఆయన తనయడు వైఎస్ జగన్ కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చేతిలో పరాజయం పొంది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ జగన్ ఉన్న 2017 నవంబర్ 6న కడప జిల్లా వైఎస్ఆర్ ఘాట్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 341వ రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్..మొత్తం 3 వేల 648 కి.మీ పాతయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలోని 13 జిల్లాల్లోని 134 నియోజకవర్గాలను చుట్టేసి 124 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని చంద్రబాబు సర్కార్ ను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఈ సందర్భంలో గత ఎన్నికల చంద్రబాబు హామీలను ప్రస్తావిస్తూ ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయలో ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, బాబు వస్తే జాబు, అమరావతి నిర్మాణం, విభజన హమీలు, ప్రత్యేక హోదా అంశాలపై ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. ఈ క్రమంలో అధికారంలోకి వస్తే నవరత్నాల పేరుతో ప్రజాకర్షణ ఫథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్ పాదయాత్ర లాగే .. ప్రజా సంకల్పయాత్ర తనకు అధికారంలోకి తీసుకువస్తుందని జగన్ ధీమాతో ఉన్నారు.
పాదయాత్రతో అధికారం సాధ్యమా ?
విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం.. ఆనాడు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారంటే చంద్రబాబు 9 ఏళ్ల పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న జనాలను తన పాదయాత్ర ద్వారా తమ వైపు తిప్పుకోవడంలో వైఎస్ఆర్ సఫలీకృతమయ్యారు..అయితే ఇప్పటి పరిస్థితులు వేరు..ఆనాడు ఉన్న వ్యతిరేకత ప్రస్తుత పరిస్థితుల్లో లేదనే వాదన వినిపిస్తోంది. పైగా అప్పటికీ ..ఇప్పటికే చంద్రబాబు ఎంతో పరిణితి చెందారని.. ఒకవైపు పాలన విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ..ప్రతిపక్షాల వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఆదాయం లేకున్నా..పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు జనాల సానుభూతి పొందుతున్నారు. ఇక విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలను బీజేపీని దోషి చూపించడంతో సఫలీకృతమయ్యారు. బీజేపీతో జగన్ పరోక్ష సంబంధాలు నెరపుతున్నారని విమర్శల దాడి చేస్తున్నారు. మరోవైపు నుంచి జగన్ అవినీతి కేసులను ఎత్తిచూపుతూ ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు రాజకీయంగానూ..ఇటు పాలనాదక్షతలో కొండలాంటి చంద్రబాబును ఢీకొని జగన్ అధికారంలోకి రావడం సవాల్ గా మారింది. ఈ సారి గెలుపుకు ఒక్క పాదయాత్ర ఒక్కటే చాలదని.. ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో జగన్ అనుసరించే వ్యూహాన్ని బట్టి ఆయన భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.