అలనాటి మేటి నటి "సావిత్రి" జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలోనూ, మోహన్ బాబు ఎస్వీ రంగారావు పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఇదే చిత్రంలో ఏఎన్నార్ పాత్రలో నటించే నటుడి పేరు కూడా ఖరారైంది. అతడే విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి విడుదలైన తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నాగ్ ఆశ్విన్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం "ఎవడే సుబ్రహ్మణ్యం"లో విజయ్ ఓ ముఖ్యపాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో దర్శకుడు క్రిష్ కె.వి.రెడ్డి పాత్రలోనూ, ప్రకాష్ రాజ్ ఆలూరి చక్రపాణి పాత్రలోనూ నటిస్తున్నారు. కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.