ఇటీవలే రిలీజైన సమ్మోహనం సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోవడంతోపాటు పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం సమ్మోహనం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న సుధీర్ బాబు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తన బావమరిది, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని, తాను సినిమాల్లోకి రావడానికి ముందు జరిగిన ఘటనల గురించి సుధీర్ బాబు వెల్లడించాడు. 2012లో 'ఎస్ఎంఎస్.. శివ మనసులో శృతి' సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్ బాబుకు ఆ తర్వాతి ఏడాదే చేసిన మరో సినిమా ప్రేమ కథా చిత్రం సూపర్ హిట్‌ని అందించింది. అనంతరం వరుస అవకాశాలు అందుకుంటున్న సుధీర్ బాబు మహేష్‌బాబుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ "మేమిద్దరం ఎప్పుడు కలిసినా మా మధ్య చర్చకొచ్చే అంశాలు సినిమాలే. అవి కాకుండా వ్యాయామం, డైట్, కుటుంబం గురించి మాట్లాడుకుంటుంటాం. పండుగలు ఉంటే మామయ్య కృష్ణ గారింట్లోనే పిచ్చాపాటి వేస్తుంటాం. ప్రతి సినిమా కథని మహేష్‌తో చర్చిస్తాను. కథలో మార్పులుచేర్పుల కోసం ఏమైనా సలహాలిస్తే తీసుకుంటాను. కాకపోతే అంతిమ నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను" అని వెల్లడించాడు.
ముఖ్యంగా తాను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు మహేష్ బాబు వద్దని అన్నారు. "పరిశ్రమలో రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు... కొంత అదృష్టం కూడా తోడవ్వాలి. లేదంటే ఎంత కష్టపడినా అంతే అని వారించారు. కానీ నేను చేసిన తొలిచిత్రం ఎస్.ఎం.ఎస్ చూశాకా మాత్రం మహేష్‌బాబే నన్ను మెచ్చుకున్నారు" అని మహేష్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.