దంగల్, ఇక్బాల్, ఎం ఎస్ ధోని, చక్ దే, బాగ్ మిల్కా బాగ్ లాంటి క్రీడా నేపథ్యమున్న చిత్రాలతో బాలీవుడ్ ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంది. కానీ.. తెలుగులో అడపా దడపా మాత్రమే క్రీడా ప్రాధాన్యమున్న చిత్రాలు వస్తున్నాయన్న విషయం వాస్తవమే. అలాంటి చిత్రాలలో గుర్తుపెట్టుకోదగ్గ టాప్ టెన్ చిత్రాల వివరాలు మీకోసం..!
అశ్వని - ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారిణి అశ్వని నాచప్ప జీవిత కథను ఆధారంగా చేసుకొని నిర్మించిన చిత్రం "అశ్వని". ఈ చిత్రంలో స్వయానా అశ్వనీ నాచప్ప టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రామోజీరావు ఈ చిత్రానికి నిర్మాత కాగా.. మౌళి సినిమాకి దర్శకత్వం వహించారు. 1991లో ఇండియన్ పనోరమాలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అలాగే అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో కూడా ప్రత్యేకంగా ప్రదర్శితమైంది. అదే విధంగా, ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా ఈ చిత్రం కైవసం చేసుకుంది.
భద్రాచలం - టైక్వాండో క్రీడను ప్రధానంగా చేసుకొని ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భద్రాచలం". ఓ గ్రామీణ యువకుడిని ఓ గురువు మంచి టైక్వాండో క్రీడాకారుడిగా ఎలా తీర్చిదిద్దుతాడన్నదే ఈ చిత్రకథ. శ్రీహరి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించగా.. ఆయనకు టైక్వాండో నేర్పించిన గురువు పాత్రలో విజయ్ చందర్ కనిపిస్తారు. ఒకటే జననం ఒకటే మరణం.. ఒకటే గమనం ఒకటే గమ్యం.. గెలుపు పొందే వరకూ అలుపు లేదు మనకు..బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు.. అనే గొప్ప సందేశాత్మక గీతం ఈ చిత్రంలోనిదే.
తమ్ముడు - పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే "తమ్ముడు". తన సోదరుడి, తండ్రి కలను నెరవేర్చడం కోసం ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు.. ఏ విధంగా కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకొని విజేతగా నిలుస్తాడన్నదే చిత్రకథ. అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. రమణ గోగుల చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. 1992లో విడుదలైన "జో జీతా వహీ సికిందర్" చిత్రానికి ఈ చిత్రం రీమేక్ అని చెప్పుకోవచ్చు. ఇదే చిత్రం తర్వాత విజయ్ హీరోగా తమిళంలో కూడా రీమేక్ చేయబడింది.
సై - రగ్బీ ఆట నేపథ్యంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే "సై". తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న బిక్షూ యాదవ్ అనే లోకల్ గూండాతో రగ్బీ ఆడి గెలవడానికి ప్రయత్నించే కొందరు కాలేజీ కుర్రాళ్ల కథ ఇది. నితిన్, శశాంక్ ఈ చిత్రంలో హీరోలుగా నటించగా.. రగ్బీ కోచ్ పాత్రలో రాజీవ్ కనకాల ఒదిగిపోయి నటించారు. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా.. కీరవాణి సంగీతాన్ని అందించారు. మంచి యూత్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రమిది.
భీమిలి కబడ్డీ జట్టు - నాని కథానాయకుడిగా తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే "భీమిలి కబడ్డీ జట్టు". తమిళ చిత్రం "వెన్నిల కబడ్డీ కుజు" చిత్రానికి ఈ సినిమా రీమేక్. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లడానికి భీమిలి ప్రాంతానికి చెందిన ఓ చిన్న జట్టు ఎలాంటి కష్ట నష్టాలు పడిందన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో భీమిలి జట్టుకి కబడ్డీ కోచ్‌గా కిశోర్ కుమార్ నటించారు. ధనరాజ్, వినయ్, చంటి, రమేష్ మొదలైన వారు కబడ్డీ క్రీడాకారులుగా నటించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
కబడ్డీ కబడ్డీ - జగపతిబాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి వెంకీ దర్శకత్వం వహించారు. తన ప్రేమను దక్కించుకోవడం కోసం రాంబాబు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి.. ప్రత్యర్థి గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులతో ఆట ఆడి ఎలా గెలుస్తాడన్నదే చిత్రకథ. ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ పాత్రలో ఎమ్మెస్ నారాయణ నటించారు. వల్లూరిపల్లి రమేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా.. చక్రి సంగీతాన్ని అందించారు. శంకరమంచి పార్థసారధి రచన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 2003లో ఈ చిత్రం విడుదలైంది.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి - రవితేజ కథానాయకుడిగా, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం "అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి". కిక్ బాక్సర్ అయిన తన తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఓ కొడుకు ఎలా శ్రమిస్తాడన్నదే ఈ చిత్రకథ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది. హాలీవుడ్ సినిమా "డ్యాన్స్ విత్ మి"ని ఈ సినిమా కొంతవరకు పోలి ఉంటుంది. ఈ సినిమాలో కిక్ బాక్సర్‌గా నటించిన రవితేజ తండ్రిగా, కోచ్‌గా కూడా ప్రకాష్ రాజ్ పాత్రలో ఒదిగిపోయి నటించారు.
గురు - విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "గురు". మురికివాడలకు చెందిన ఓ అమ్మాయిని.. గొప్ప బాక్సింగ్ క్రీడాకారిణిగా తీర్చిదిద్దడానికి ఓ కోచ్ ఎలా కష్టపడ్డాడన్నదే చిత్రకథ. ఈ సినిమాలో కోచ్ పాత్రలో వెంకటేష్ వైవిధ్యమైన నటనను ప్రదర్శించగా.. క్రీడాకారిణి పాత్రలో రితిక సింగ్ నటించారు. హిందీ చిత్రం "సాలా కాదూస్" చిత్రానికి ఈ చిత్రం రీమేక్. మాతృకలో కోచ్ పాత్రలో నటుడు మాధవన్ నటించడం విశేషం. వై నాట్ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను చేపట్టింది.
జై - భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య బాక్సింగ్ మ్యాచ్ పెడితే ఎలా ఉంటుంది అన్న కోణంలో దర్శకుడు తేజ తీసిన చిత్రం "జై". ఈ చిత్రంలో టైటిల్ రోల్లో నవదీప్ నటించగా.. కోచ్ పాత్రలో తనికెళ్ల భరణి నటించారు. ఇదే చిత్రం "జైరామ్" పేరుతో తమిళంలో కూడా విడుదలైంది.
గోల్కొండ హై స్కూల్ - ఇంద్రగంటి మోహనకృష్ఱ దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటించిన చిత్రం "గోల్కొండ హైస్కూలు". ఈ చిత్రంలో హైస్కూలు విద్యార్థులకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే కోచ్‌గా నటుడు సుమంత్ నటించారు. పి రామ్ మోహన్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహించగా.. పి.హరిమోహన్ నవల "ది మెన్ వితిన్" ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.