సర్వ హక్కులూ సీజేఐకే.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏ కేసులను ఏ బెంచ్‌లకు అప్పగించాలనే విషయంపై కొత్త నిబంధనలను రూపొందించాలంటూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Last Updated : Apr 11, 2018, 07:47 PM IST
సర్వ హక్కులూ సీజేఐకే.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఏ కేసులను ఏ బెంచ్‌లకు అప్పగించాలనే విషయంపై కొత్త నిబంధనలను రూపొందించాలంటూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసులను కేటాయించడం, బెంచులను ఏర్పాటుచేయడంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కే సర్వహక్కులూ ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. సీజేఐ ‘సమానులలో ప్రథములు’, ఈ పిల్ అవమానకరమని పేర్కొంటూ దాన్నితోసిపుచ్చింది. అందులో కలగజేసుకునేందుకు తాము ప్రయత్నించలేమని సుప్రీం తెలిపింది. కేసుల విషయంలో కొత్త నిబంధనలను తాము అనుమతించలేమని పేర్కొంది.

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసుల కేటాయింపులు, రాజ్యాంగ ధర్మాసనాల ఏర్పాటుపై మార్గదర్శకాలు తయారుచేయాలని కోరుతూ అశోక్‌ పాండే అనే వ్యక్తి ఇటీవల పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘భారత ప్రధాన న్యాయమూర్తి సమానులలో ప్రథములు. కేసులను కేటాయించడం, రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటుచేయడంపై నిర్ణయం తీసుకునే హక్కు సీజేఐకు ఉంటుంది’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ తీర్పును లిఖిస్తూ స్పష్టం చేశారు.

‘సుప్రీంకోర్టు వ్యవహారాల్లో సీజేఐదే తుది నిర్ణయం అని రాజ్యాంగం చెప్పింది. పారదర్శక పనితీరు కోసం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆయన బాధ్యతలపై అవిశ్వాసం తగదు. ఈ పిటిషన్‌ సీజేఐ పదవికి మచ్చ తెచ్చేలా ఉంది’ అని ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.

Trending News