గోద్రా కేసు; 11 ఉరిశిక్షలు జీవితఖైదీలుగా మార్పు

Last Updated : Oct 10, 2017, 06:39 PM IST
గోద్రా కేసు; 11 ఉరిశిక్షలు జీవితఖైదీలుగా మార్పు

గోద్రా రైలు బోగి దహనం కేసులో గుజరాత్ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 11 మంది ఖైదీలకు పడిన ఉరిశిక్షను జీవితఖైదుగా మారుస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించిన 63 మందిని దోషులుగా చేర్చడం కుదరదని గుజరాత్ సర్కార్‌కు తెలిపింది. అలాగే రైలు ఘటన  మృతుల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని గుజరాత్ సర్కార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నష్ట పరిహారం చెల్లింపునకు ఆరువారాల గడువు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

గుజరాత్‌లోని గోద్రా ప్రాంతంలో 2002 ఫిబ్రవరి 27న రైలు దహనం చేసిన విషయం తెలిసిందే. అయోధ్య నుంచి అహ్మదాబాద్ వస్తున్న సబర్మతీ ఎక్స్ప్రెస్ పై గోద్రా స్టేషన్ వద్ద ఆందోళన కారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 59 మంది మృతి చెందగా అనేక మంది గాయాలపాలయ్యారు. దీనిపై విచారణ జరిపిన స్పెషల్ ట్రయల్ కోర్టు 2011 మార్చి 1 ను తీర్పు వెలువరించింది. ఈ కేసులో 31 మందిని దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు ఖరారు చేసింది. వీరిలో 11 మందికి ఉరిశిక్ష విధంచగా మిగతా 20 మందికి జీవిత ఖైదు పడింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని..ఇది కుట్రపూరితంగా రైలు బోగీలకు నిప్పంటించారని నిర్ధారించుకున్న కోర్టు.. దోషులకు శిక్ష ఖరారు చేసింది.

గోద్రా కేసులో శిక్ష పడ్డ వారు ట్రయిల్ కోర్టును సవాలు చేస్తూ 211 ఏప్రిల్ 6న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఈ కేసులో 63 మందిని నిర్దోషులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన హైకోర్టు..సోమవారం తీర్పు వెలువరించింది.  ఉరిశిక్షలను జీవితఖైదులుగా తగ్గించింది. అలాగే నిర్ధోషుల విషయంలో ట్రయిల్ కోర్టు తీర్పును సమర్ధించింది.

Trending News