ఢిల్లీలో ఆడ్ ఇవెన్ స్కీమ్‌కి ఎన్‌జీటీ ఆమోదం

  

Last Updated : Nov 11, 2017, 02:02 PM IST
ఢిల్లీలో ఆడ్ ఇవెన్ స్కీమ్‌కి ఎన్‌జీటీ ఆమోదం

భారత రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకొని ఆపసోపాలు పడుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆడ్ ఇవెన్ స్కీమ్‌కి ఎట్టకేలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. అయితే  మోటార్ బైకులను, మహిళలను ఈ స్కీమ్ నుండి మినహాయిస్తామని చెప్పిన ప్రభుత్వానికి.. అలా మినహాయించాల్సిన అవసరం లేదని ఎన్‌జీటీ తెలిపింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఢిల్లీలో కార్ల రేషనైజింగ్ అనేది ఈ సోమవారం నుండే మొదలవుతుంది.

నెంబరు ప్లేటులో చివర సరి సంఖ్య ఉన్న కారు, బేసి సంఖ్య ఉన్న తేదీ నాడు ఢిల్లీ రోడ్డు మీద ప్రయాణించడానికి వీలులేదు. అలాగే చివర బేసి సంఖ్య ఉన్న కారు, సరి సంఖ్య ఉన్న తేదీ నాడే రోడ్డు మీద ప్రయాణించాలి. ఇలా చేయడం వల్ల కేవలం కొన్ని వాహనాలను మాత్రమే ప్రతీ రోజు రోడ్డుపైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్ అన్ని వాహనాలకూ వర్తింపజేయమని.. కార్లకు మాత్రమే పరిమితం చేయవద్దని ఎన్‌జీటీ ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.

ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఈ సోమవారం నుండి అయిదు రోజులు ఈ స్కీమ్‌ను ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ నిర్వహించనుంది. సాధారణంగా కాలుష్యానికి సంబంధించిన పారమీటర్ పీఎం 10 అనేది 300 శాతం లెవల్ దాటిపోతే..  వెంటనే ఈ ఆడ్ ఇవెన్ స్కీమ్‌ను అమలుచేయాలని ట్రిబ్యునల్ ప్రభుత్వానికి తెలిపింది. అలాగే ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా ఢిల్లీ పోలీస్ డిపార్టుమెంటుకు తెలియజేసింది ఎన్‌జీటీ. ఈ స్కీమ్ ఢిల్లీ చుట్టూ ప్రక్కల రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని ఎన్‌జీటీ తెలపడం గమనార్హం. 

Trending News