తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయాల్లోకి వస్తారా.. ? లేదో .. ? ఇంకా తేలలేదు. ఐతే ఆయన మాత్రం తన అభిమానులతోపాటు తమిళ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటానని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన ప్రవేశం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐతే రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ రజినీ మండ్రుం పేరుతో అభిమాన సంస్థను ఏర్పాటు చేసి.. దాని ద్వారా .. ఎప్పటికప్పుడు అభిమానులను కలుస్తున్నారు. అంతే కాదు .. దేశ, రాష్ట్ర రాజకీయాల్లోని అంశాలపై తనదైన శైలిలో ఆయన స్పందిస్తున్నారు.
తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా ఎన్డీఏ పార్టీలు దీన్ని సమర్థిస్తుండగా. . మిగతా రాజకీయ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం - caa-2019తోపాటు NRCపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతే కాదు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం - caa-2019కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలు కూడా చేశారు. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ .. పౌరసత్వ సవరణ చట్టం - caa-2019పై తన గళం విప్పారు.
చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ . . పౌరసత్వ సవరణ చట్టం - caa-2019కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ చట్టం వల్ల దేశంలో ఏ ఒక్క పౌరునికి అన్యాయం జరగదని తలైవా అన్నారు. ఒక వేళ పౌరసత్వ సవరణ చట్టం - caa-2019 ద్వారా ముస్లిం పౌరులకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాడే వ్యక్తుల్లో తానే మొదటి వాడినని సూపర్ స్టార్ అన్నారు. అంతే కాదు జాతీయ జనగణన రిజిస్టర్ దేశానికి కచ్చితంగా అవసరం ఉందన్నారు. దీని వల్ల భారతీయులు కాని పౌరులు ఎవరో గుర్తుపట్టవచ్చని తెలిపారు. ఐతే NRC పై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి.. దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేది లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు.