వాట్సాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి: ఎస్బీఐ

వాట్సాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి: ఎస్బీఐ 

Last Updated : Mar 13, 2019, 07:32 PM IST
వాట్సాప్ ద్వారా మోసాలు జరుగుతున్నాయి: ఎస్బీఐ

న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగిస్తున్న తమ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్పీఐ) ఖాతాదారులను హెచ్చరించింది. ఖాతాదారులకు సంబంధించిన బ్యాంక్ ఎకౌంట్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సంబంధిత వివరాలు పంచుకోవాలంటూ కొంతమంది మోసగాళ్లు ఖాతాదారులకు ఫోన్ చేసి వారి ఖాతాల్లో వున్న మొత్తాన్ని కాజేస్తున్నారని చెబుతూ అటువంటి సందేశాలు, ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త వహించాల్సిందిగా ఎస్బీఐ సూచించింది. బ్యాంక్ సిబ్బంది పేరుతో ఖాతాదారులకు ఫోన్ చేసి పరిచయం చేసుకోవడంతో మోసగాళ్లు తమ కుట్రలకు తెరతీస్తారని, అనంతరం ప్రస్తుతం మీరు(ఖాతాదారులు) వినియోగిస్తున్న డెబిట్ / క్రెడిట్ కార్డు స్థానంలో మరిన్ని ప్రయోజనాలు కలిగిన కొత్త అప్‌డేటెడ్ కార్డు జారీచేస్తామని నమ్మబలుకుతారని ఎస్బీఐ తెలిపింది. ఈ క్రమంలోనే వినియోగదారుడి కార్డు నెంబర్, సీవీవీ నెంబర్, చివరి తేదీ, పూర్తి పేరు వంటి వివరాలు అడిగి తెలుసుకుంటారు. వెరిఫికేషన్ కోసం మీ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) పంపిస్తామని చెప్పి, స్వయంగా ఖాతాదారుడినే మళ్లీ ఆ ఓటీపీ అడిగి తెలుసుకుంటారు. వారి చేతిలో మోసపోతున్నామని గుర్తించని ఖాతాదారులు ఆ ఓటీపీ వివరాలు వారితో పంచుకుని ఇబ్బందులపాలవుతున్నారని ఎస్బీఐ తెలిపింది. 

మోసాల్లో ఇది ఒక ఎత్తైతే, కార్డ్ అప్‌గ్రేడ్ కోసం వాట్సాప్ లేదా మెస్సేజ్ ద్వారా ఓ సందేశాన్ని పంపిస్తామని చెప్పి, ఆ సందేశంతోపాటే ఓ లింకుని కూడా జతచేసి పంపిస్తారు. ఆ మెస్సేజ్ ఓపెన్ చేయగానే ఆ లింకు ద్వారా ఖాతాదారుడికి తెలియకుండానే ఓ మాల్‌వేర్ వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. అది వారికి తెలియకుండానే బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపిని సదరు మోసగాళ్లకు చేరవేస్తుంది. మోసాల్లో ఇది ఇంకో కొత్త రకమైన మోసంగా ఎస్బీఐ అభివర్ణించింది. అందుకే ఖాతాదారులు వారి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ, ఎవ్వరితోనూ పంచుకోరాదని బ్యాంక్ సూచించింది.

Trending News