పట్టువీడేది లేదంటున్న తమిళనాడు ఆర్టీసీ కార్మికులు

తమిళనాడు రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఆదివారం కూడా కోనసాగుతోంది.

Last Updated : Jan 7, 2018, 12:01 PM IST
పట్టువీడేది లేదంటున్న తమిళనాడు ఆర్టీసీ కార్మికులు

తమిళనాడు రాష్ట్రంలో గత మూడురోజుల నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఆదివారం కూడా కొనసాగుతోంది. ప్రజలు ఆర్టీసీ సౌకర్యం లేక తీవ్రఅవస్థలు పడుతున్నారు.  దాంతో ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడపడానికి తాత్కాలిక బస్సు డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. బస్ స్టాప్ ల వద్ద ప్రైవేటు బస్సుల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. ఆర్టీసీ రవాణా స్తంభించిన కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణీకులు రైలు, ఆటోరిక్షాలు మరియు ప్రైవేటు రవాణా వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రయాణిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామి, రవాణా సమ్మెతో పరిస్థితి తీవ్రంగా మారడంతో రవాణాశాఖ అధికారులతో చర్చలు జరిపారు. శనివారం తమిళనాడు రవాణా మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ రవాణా కార్మికులు సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకొని తిరిగి విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. "విధుల్లో చేరాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టు కూడా వారిని విధుల్లోకి వెళ్లాలని కోరింది. ప్రజలు అవస్థలు పడకూడదని మేము ప్రైవేట్ గా డ్రైవర్లను, కండక్టర్లను నియమించాము. పరిస్థితి త్వరలోనే సద్దుమణుగుతుంది" అని మంత్రి అన్నారు. 

సమ్మె ఎందుకంటే..? 

వేతనాలు పెంచాలని, వేతన చెల్లింపుల నుంచి మినహాయించుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలనే డిమాండ్ తో ఈ నెల 4వ తేదీ గురువారం నుండి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర రవాణా సంస్థలకు అనుబంధంగా ఉన్న 40పైగా కార్మిక సంఘాలు నిరసనను తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. కార్మికులు పే స్కేల్ 30,000 రూపాయలకు డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు రూ. 24,400 చెల్లించాలని అంగీకరించారు.

Trending News