జమ్మూ కాశ్మీర్లో కొంతమంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ తమ ఉద్యోగాలకి మూకుమ్మడి రాజీనామాలు చేసినట్టుగా మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. పోలీసులు మూకుమ్మడి రాజీనామా చేశారనే వార్తలు అవాస్తమని, అవి దురుద్దేశపూర్వకంగా పలు అసాంఘిక శక్తులు సృష్టించిన పుకార్లు మాత్రమే కానీ అందులో నిజం లేదని జమ్మూకాశ్మీర్ పోలీసులు తేల్చిచెప్పినట్టుగా కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. పరిపాలనాపరమైన కారణాలతో సర్వీస్ పునరుద్ధరణ అవని పోలీసులు చూపిస్తూ, పోలీసులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న 30000లకుపైగా మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ విధులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు హోంశాఖ ప్రకటన పేర్కొంది.
ఇదిలావుంటే, కాశ్మీర్లో ఇటీవల కాలంలో పోలీసులు, వారి కుటుంబాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరుపుతున్న దాడులు వారి కుటుంబాలని ఆభద్రతాభావానికి గురిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే కాశ్మీర్లో పలువురు పోలీసులు తమ ఉద్యోగాలకు మూకుమ్మడి రాజీనామాలు చేశారనే వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే.