న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి.. చివరి వరకు అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో అరుణ్ జైట్లీ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం.. ‘ద రినైజెన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. ఆయన చేసిన సలహాలు, సూచనలు ఎప్పుడూ మంచే చేశాయి. అలాంటి జైట్లీ గారు ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను'' అని ఆవేదన వ్యక్తంచేశారు.
దేశానికి ఆయన లేని లోటు తీర్చలేనిది..
ఈ సందర్భంగా అరుణ్ జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రతీ విషయంలోనూ నిక్కచ్చిగా, ముక్కుసూటిగా ఉండటమే జైట్లీ తత్వమని అన్నారు. చాలాసార్లు జైట్లీతో కలిసి దూర ప్రయాణాలు చేసిన సందర్భాలను, ఒకరిపై ఒకరికున్న గౌరవభావాలను గుర్తుచేసుకుంటూ.. ఏ విషయాన్నయినా సమర్థవంతంగా చెప్పడంలో జైట్లీ తర్వాతే ఎవరైనా అని ప్రశంసించారు. క్లిష్ట సమయాల్లోనూ సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించి మంచి పరిష్కారం సూచించడంలో ఆయనకి ఆయనే సాటి అని జైట్లీని కొనియాడారు.
Read also : మాతృభాషపై మరోసారి ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
విజ్ఞానగని, చురుకైన ట్రబుల్ షూటర్..
‘అరుణ్ జైట్లీ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. మంచి మనస్తత్వం ఉన్నవ్యక్తి. బహుముఖ ప్రజ్ఞాశాలి. విజ్ఞానగని, చురుకైన ట్రబుల్ షూటర్’ అంటూ దివంగత జైట్లీపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకుని ఏకాభిప్రాయ సాధనతో.. కీలకమైన జీఎస్టీ వంటి పన్నుసంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, విదేశాంగ శాఖ సహాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ వి. మురళీధరన్, కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి కిరణ్ రిజిజుతోపాటుగా వివిధ రంగాల ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read also : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సేవలను కొనియాడిన ప్రధాని మోదీ
అరుణ్ జైట్లీతో వెంకయ్య నాయుడుకి ఉన్న అనుబంధం, గౌరవ భావానికి నిదర్శనం..
అరుణ్ జైట్లీతో ఉన్న అనుబంధం, గౌరవ భావానికి నిదర్శనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్, కూతురు శ్రీమతి దీపావెంకట్ ‘ద రినైజెన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని తీసుకురావడం విశేషం. జైట్లీ భార్య సంగీత జైట్లీ, కుమారుడు, కూతురి సమక్షంలోనే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.