వొడాఫోన్-ఐడియా విలీనం: 'వోడాఫోన్ ఐడియా లిమిటెడ్'గా పేరు మార్పు

వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్‌లు విలీన ప్రక్రియ పూర్తయింది.

Last Updated : Aug 31, 2018, 02:57 PM IST
వొడాఫోన్-ఐడియా విలీనం: 'వోడాఫోన్ ఐడియా లిమిటెడ్'గా పేరు మార్పు

వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ లు విలీన ప్రక్రియ పూర్తయింది. ఇక నుంచి 'వొడాఫోన్ ఐడియా లిమిటెడ్' పేరుతో ఈ టెలికాం కంపెనీలను పిలవనున్నారు. ఈ రెండు కంపెనీల కలయికతో.. 'వొడాఫోన్ ఐడియా లిమిటెడ్' భారతదేశంలో అతిపెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా నిలిచింది. ఈ రెండు కంపెనీలకు 408 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని.. వారందరికీ సేవలను అందిస్తామని ఈ రెండు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.

విలీనమైన తర్వాత ఈ రెండు కంపెనీలు కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కంపెనీలో మొత్తం 12 మంది డైరక్టర్లు ఉంటారు. వీరిలో ఆరుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉంటారు. ఈ కంపెనీకి కుమార మంగళం బిర్లా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సీఈవోగా బాలేశ్ శర్మను బోర్డు ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని విలీనమయ్యాక ఇరు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

విలీనం అధికారికంగా పూర్తి కావడంపై వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా హర్షం వ్యక్తం చేశారు. 'నేడు మేము భారత్‌లోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించాం. ఇది నిజంగా చారిత్రాత్మక విషయం’ అని పేర్కొన్నారు. విలీనం పూర్తి కావడంతో ప్రస్తుతం ఐడియా కంపెనీ షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. 

ఈ విలీన ప్రక్రియ పూర్తవడంతో దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఐడియా సెల్యులార్-వొడాఫోన్ ఇండియా విలీనంతో నెం.1 స్థానం నుంచి ఎయిర్‌టెల్‌ కిందికి దిగొచ్చింది. రిలయన్స్‌ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య పోటీ మరింత పెరిగిన సంగతి తెలిసిందే.

 

Trending News